Bachupally | దుండిగల్, ఫిబ్రవరి 17: ఎలాంటి అర్హత లేకుండానే బాచుపల్లిలో రోగులకు వైద్యం చేస్తున్న డాక్టర్‌పై వైద్యాధికారులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆమె నడిపిస్తున్న క్లినిక్‌ను మూసివేసి షోకాజ్ నోటీసులు జారీ చేశారు. అలాగే మల్లంపేట పరిధిలోని మరో వైద్యశాలకు కూడా షోకాజ్ నోటీసులు ఇచ్చారు.
ఈనెల 13వ తేదీన నేషనల్ మెడికల్ కౌన్సిల్ (ఎన్ఎంసీ) వైస్ చైర్మన్ డాక్టర్ శ్రీనివాస్ నేతృత్వంలో డా.ఇమ్రాన్, డా. విష్ణు ప్రతినిధుల బృందం బాచుపల్లిలోని బుచ్చిబాబు క్లినిక్ తో పాటు మల్లంపేటలోని పలు క్లినిక్‌లు, ఫస్ట్ ఎయిడ్ సెంటర్లలో తనిఖీలు నిర్వహించింది. ఈ నేపథ్యంలో ఎలాంటి అర్హతలు లేకుండా అల్లోపతి వైద్యం అందిస్తూ రోగులకు యాంటీబయాటిక్ లు, స్టెరాయిడ్స్, పెయిన్ కిల్లర్లు వంటి మందులను సిఫారసు చేస్తున్నట్లు గుర్తించారు. బాచుపల్లిలోని బుచ్చిబాబు క్లినిక్‌లో నిబంధనలకు విరుద్ధంగా ఓ మహిళ ఎటువంటి అర్హతలు లేకుండానే డాక్టర్‌గా చలామణి అవుతూ వైద్యం చేస్తున్నట్లు గుర్తించారు. అదే సమయంలో లెటర్ ప్యాడ్ లోనూ డాక్టర్ అని రాసుకోవడాన్ని ఎన్ఎంసీ అధికారులు సీరియస్‌గా పరిగణించారు.
ఈ క్రమంలో మేడ్చల్ జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ అధికారులు సోమవారం నాడు కుత్బుల్లాపూర్ నియోజకవర్గ పరిధిలో మరోసారి తనిఖీలు చేపట్టారు. డిప్యూటీ డీఎంహెచ్‌వో, మల్కాజ్గిరి డివిజన్ ఇంచార్జ్ డా. శోభారాజ్ నేతృత్వంలో బుచ్చిబాబు క్లినిక్‌లో మరోసారి తనిఖీలు జరిపారు. క్లినిక్‌ను నిబంధనలకు విరుద్ధంగా నడుపుతున్నట్లు గుర్తించడంతోపాటు ఎటువంటి అర్హతలు లేకుండానే అరుణకుమారి అని మహిళ రోగులకు వైద్యం అందిస్తున్నట్లు తేల్చి షోకాజ్ నోటీసులు అందజేశారు. మల్లంపేటలోని మరో వైద్యశాల నిర్వాహకులకు సైతం షోకాజ్ నోటీస్ అందజేశారు. పూర్తి నివేదికను డీఎంహెచ్‌వోకు అందజేసి వారి నిర్ణయం ప్రకారం చర్యలు చేపట్టనున్నట్లు తెలిపారు.
మల్లంపేటలో మూతపడిన క్లినిక్ లు
మేడ్చల్ జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారుల తనిఖీల నేపథ్యంలో బాచుపల్లిలోని ప్రైవేటు క్లినిక్‌ల నిర్వాహకులు, మెడికల్ షాపుల యజమానులు అప్రమత్తమయ్యారు. తమ క్లినిక్‌లు, మెడికల్ షాపులను మూసివేశారు. ప్రధానంగా మల్లంపేటలోని పలు క్లినికల్ నిర్వాహకులు తమ ఫస్ట్ ఎయిడ్ సెంటర్లకు తాళాలు వేసుకోవడం కనిపించింది. ఇదే విషయాన్ని మండల వైద్యాధికారి డా. స్వర్ణలత సైతం స్పష్టం చేయడం గమనార్హం.