మేడ్చల్/మేడ్చల్ కలెక్టరేట్ /బోడుప్పల్ /జవహర్‌నగర్/ కీసర/ శామీర్‌పేట / ఘట్కేసర్ / పీర్జాదిగూడ, జూలై 20 : మేడ్చల్ నియోజకవర్గం తడిసి ముద్దయింది. రెండు రోజులుగా వర్షం ఎడతెరిపి లేకుండా కురుస్తూనే ఉంది. ముసురుతో పాటు మధ్య మధ్యలో కురుస్తున్న మోస్తారు వర్షంతో రోడ్లు జలమయమయ్యాయి.జలశయాల్లోకి నీరు వచ్చి చేరుతుంది. విరామం లేకుండా కురస్తున్న వర్షాలతో జన జీవనం అతలాకుతలమైంది. వీధి వ్యాపారులు ఇంటికే పరిమితం అయ్యారు.భారీ వర్షాలు కురుస్తున్న కారణంగా పురపాలక సంఘాల సిబ్బంది అప్రమత్తమయ్యారు. మురుగు కాల్వలు నిండి, రోడ్డుపై మురికి నీరు పారకుండా చర్యలు తీసుకుంటున్నారు. ఎక్కడైనా డ్రైనేజీ స్తంభిస్తే వెంటనే రంగంలో దిగి బాగు చేస్తున్నారు. మేడ్చల్ నుంచి గౌడవెల్లి దారిలో ఉన్న వాగు రోడ్డుపై నుంచి నీరు ప్రవహిస్తోంది. అలాగే పట్టణంలో పలు ప్రాంతాల్లో రోడ్లపై నుంచి నీరు ప్రవహిస్తుండటంతో వాహనదారులు, పాదచారులు ఇబ్బంది పడ్డారు. నాగా రం, దమ్మాయిగూడ మున్సిపాలిటీల్లోని ముంపు కాలనీలు వర్షపు నీటిలో నిండి పోయాయి. నాగారం 6, 18, 19, 20 వార్డుల్లో చైర్మన్ చంద్రారెడ్డి, కమిషనర్ రాజేంద్రకుమార్ పరిశీలించారు. ముంపు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని చంద్రారెడ్డి ప్రజలకు సూచించారు.
రోడ్లపై నిలిచిన వర్షపు నీటిని మున్సిపల్ సిబ్బంది తొలగించారు.రెండురోజులుగా కురుస్తున్న వర్షాలకు బోడుప్పల్ లోతట్టు ప్రాంతాలు జలయమమయ్యాయి. లోతట్టు ప్రాంతాలతో పాటు రా చెరువు నుంచి సుద్దకుంట పరిసరప్రాంతాల్లో కమిషనర్ వేణుగోపాల్‌రెడ్డి పర్యటించారు. ఇంజినీరింగ్, పారిశుధ్య అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. పెరుగుతున్న వరద ఉధృతిని దృష్టిలో పెట్టుకుని సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని మేయర్ బుచ్చిరెడ్డి అధికారులను ఆదేశించారు. జవహర్‌నగర్‌లో కార్పొరేషన్లో సేవలందించడానికి ప్రత్యేక బృందాలను 24 గంటలు అందుబాటులో ఉంచామని కమిషనర్ రామలింగం తెలిపారు. శామీర్‌పేట, మూడుచింతలపల్లి మండలాల్లోని కుంటల్లోకి వదరనీరు వచ్చి చేరింది. శామీర్‌పేట చెరువు కింద వాగులో పొన్నాల, బొమ్మరాశిపేట, అద్రాస్పల్లి చెక్‌డ్యాంలు పొం గి పొర్లుతున్నాయి. ఘట్కేసర్, పోచారం మున్సిపాలిటీ పరిధిలోని పలు కాలనీలు జలమయం అయ్యాయి. మున్సిపాలిటీ సంస్కృతి టౌన్షిప్లో వరద నీరు స్తంభించకుండా కౌన్సిలర్ హరిప్రసాద్‌రావు సిబ్బందితో శుభ్రం చేయించారు.పీర్జాదిగూడ కార్పొరేషన్‌లోని ప్రధాన రోడ్లు, అంతర్గత రోడ్లు, లోతట్టు ప్రాంతాలు జలమయ్యాయి. లోతట్టు ప్రాంతాలను అధికారులు సందర్శించి, నీటిని తొలగించేందుకు చర్యలు తీసుకున్నారు. కమిషనర్ వంశీకృష్ణ,సిబ్బంది, నాయకులు పరిస్థితులను పర్యవేక్షించారు.