Hyderabad | మేడ్చల్, జనవరి31(నమస్తే తెలంగాణ): ఎలివేటెడ్ కారిడార్ బ్రిడ్జి నిర్మాణానికి సంబంధించి భూ సేకరణ గుర్తింపు ప్రక్రియను అధికారులు వేగవంతం చేశారు. ఈ క్రమంలోనే భూసేకరణ ప్రక్రియకు సంబంధించి వచ్చిన అభ్యంతరాలపై విచారణ చేస్తున్నారు.
ప్యారడైజ్ నుంచి తూంకుంట ఔటర్ రింగు రోడ్డు వరకు 18 కిలో మీటర్ల మేరకు నిర్మించినున్న ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణ పనులకు సంబంధించి మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా పరిధిలో భూ సేకరణ గుర్తింపు ప్రక్రియ ఇప్పటికే పూర్తి చేశారు. అనంతరం అభ్యంతరాల స్వీకరణకు నోటిఫికేషన్ జారీ చేయగా మేడ్చల్-మల్కాజిగిరి జిల్లాకు సంబంధించి 325 అభ్యంతరాలు వచ్చినట్లు అధికారులు తెలిపారు. ఇందులో రెవెన్యూకు సంబంధించి వచ్చిన 40 అభ్యంతరాలపై నోటీసులు జారీ చేసి విచారణ జరిపారు. మిగిలిన 285 మంది అభ్యంతరాలు తెలిపిన వారికి నోటీసులు ఇచ్చి విచారించేందుకు హెచ్ఎండీఏ అధికారుల నుంచి అనుమతి రావాల్సి ఉంది. అయితే ఇప్పటి వరకు వచ్చిన అభ్యంతరాల విచారణపై హెచ్ఎండీఏ ఎలాంటి నిర్ణయం తీసుకోకపోవడంతో వాటిని పరిష్కరించేందుకు మరింత సమయం పట్టే అవకాశం ఉంటుందని అధికారుల ద్వారా తెలిసింది.
ఎలివేటెడ్ కారిడార్ బ్రిడ్జి నిర్మాణ పనుల్లో భాగంగా కోల్పోతున్న 348 నిర్మాణాలు.. 1,12,033 చదరపు అడుగుల ఖాళీ స్థలాన్ని మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా సర్వే డిపార్ట్మెంట్ శాఖ గుర్తించింది. అయితే 348 నిర్మాణాల యజమానుల, 1,12,033 చదరపు అడుగుల స్థలాలకు చెందిన యజమానుల జాబితాను సిద్ధం చేసి.. ఆ నివేదికను మేడ్చల్ జిల్లా అధికారులు హెచ్ఎండీఏకు అందజేశారు. హెచ్ఎండీఏ ముందుగా వచ్చిన అభ్యంతరాలను పరిష్కరించి అ తర్వాత ఆస్తుల, స్థలాలకు ఆస్తి నష్ట పరిహారం చెల్లింపుపై నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది.
ఎలివేటెడ్ కారిడార్ బ్రిడ్జి నిర్మాణానికి సంబంధించిన భూసేకరణ ప్రక్రియపై గత నవంబర్ 17న నోటీఫికేషన్ జారీ చేసిన విషయం తెలిసిందే. అయితే హైదరాబాద్ జిల్లా పరిధిలో భూ సేకరణ గుర్తింపు పక్రియలో అనేక అభ్యంతరాలు వచ్చాయి. ఎలివేటెడ్ కారిడార్ బ్రిడ్జి నిర్మాణ పనులకు సంబంధించి వస్తున్న సాంకేతిక సమస్యలు అధిగమించేది ఎప్పుడు బ్రిడ్జి పనులు ప్రారంభమయ్యేది ఎప్పుడు అని ప్రజల నుంచి అనేక ప్రశ్నలు వస్తున్నాయి.