సిటీబ్యూరో, జూన్ 3 (నమస్తే తెలంగాణ): వర్షాకాలం వచ్చిందంటే చాలు డెంగ్యూ, మలేరియా, వైరల్ ఫీవర్ ఇలా ప్రజలు సీజనల్ వ్యాధులబారిన పడుతుంటారు. ఈ ఏడాది జనవరి నుంచి హైదరాబాద్ డీఎంఅండ్‌హెచ్‌ఓ పరిధిలో 297 డెంగ్యూ కేసులు నమోదవగా.. 9 మలేరియా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. వైద్యారోగ్యశాఖ అధికారులు ఇప్పటికే సీజనల్ వ్యాధుల కట్టడికి చర్యలను ముమ్మరం చేస్తున్నారు. ఇందులో భాగంగానే జూన్ నెలను డెంగ్యూ నివారణ నెలగా, జూలై నెలను మలేరియా నియంత్రణకోసం యాక్షన్ ప్లాన్ సిద్ధం చేశారు. మలేరియా కట్టడి చర్యలపై హైదరాబాద్ జిల్లా మలేరియా నియంత్రాణాధికారి డాక్టర్ శ్రీ హర్ష ‘నమస్తే తెలంగాణ’కు వెల్లడించారు.
పరీక్షలు నిర్వహిస్తున్నాం
సీజనల్ వ్యాధులు ప్రబలుతున్న నేపథ్యంలో ఇప్పటికే జిల్లా వైద్యారోగ్య శాఖ యాక్షన్ ప్లాన్ సిద్ధం చేసింది. జిల్లాలోని 91 పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల పరిధిలో ఉన్న బస్తీల్లో క్యాంపులు నిర్వహించనున్నాం. ఆశా కార్యకర్తలు ఇప్పటికే ఇంటింటికి వెళ్లి ఫీవర్ సర్వే చేస్తున్నారు. సర్వేలో డెంగ్యూ, మలేరియా లక్షణాలు ఉంటే వెంటనే ఆసుపత్రికి రిఫర్ చేస్తున్నారు. ఈ ఏడాది జనవరి నుంచి ఇప్పటివరకు వైద్య సిబ్బంది ఇంటింటికి వెళ్లి 1,06,403 మలేరియా పరీక్షలు నిర్వహించారు. వాటిలో 9 యాక్టివ్ కేసులు నమోదయ్యాయి. డెంగ్యూ టెస్టులు 10,668 చేయగా వాటిలో 297 పాజిటివ్ కేసులు గుర్తించి వారికి
వైద్యమందించాం.
ఆరు సబ్యూనిట్ల కేంద్రంగా ఫీవర్ సర్వే..
జిల్లాలో చేపడుతున్న ఫీవర్ సర్వే ఆరు సబ్ యూనిట్ల కేంద్రంగా నిర్వహిస్తున్నాం. వాటిలో మలక్‌పేట, మాసాబ్‌ట్యాంక్, కింగ్‌కోఠి, ఫీవర్ ఆస్పత్రి, సికింద్రాబాద్, కంటోన్మేంట్ సబ్ యూనిట్ల పరిధిలో నిర్వహించే సర్వేను ఎప్పటికప్పుడు వైద్యాధికారులు పర్యవేక్షిస్తున్నారు. డెంగ్యూ, మలేరియా సోకిన వ్యక్తి ఇంట్లో నీటి శాంపిల్ సేకరించడంతో పాటు రోగి కుటుంబ సభ్యులు, చుట్టుపక్కల ఉండే 70 నుంచి 100 ఇండ్లలో నివాసముంటున్న వారందరికి కూడా వెంటనే ఫీవర్ సర్వే చేసేలా చర్యలు తీసుకుంటున్నాం. దాంతో పాటు పిచికారీ, ఫాగింగ్ పెట్టనున్నాం.
ఏఎల్ఓ ఆపరేషన్ అమలు..
డెంగ్యూకు కారణమైన ఏడీస్ ఈజిైప్టె దోమ ఒకేసారి 600 గుడ్లు నీళ్లలో పెడుతుంది. వాటి పెరుగుదల ఆపాలంటే గుడ్ల దశలోనే నిర్మూలించడం అవసరం. దోమలు కుట్టకుండా చర్యలు తీసుకోవడం కంటే అసలు దోమ ఎదగకుండా తీసుకునే చర్యల్లో భాగమే ఆంటీ లార్వా ఆపరేషన్(ఏఎల్ఓ). ఆ ఆపరేషన్ ద్వారా ప్రతి ఫ్రైడేను డ్రై డే అమలు చేస్తూ, ఇంటి పరిసరాల్లో ఉండే డ్రమ్ములు, కూలర్లలో నీటిని తొలగించి వాటిని శుభ్ర పరచడం ద్వారా డెంగ్యూకు కారణమైన దోమ ఎదుగుదలను అడ్డుకున్నవాళ్లమవుతాం. చిన్నపాటి తోకపురుగులు సైతం సీజనల్ వ్యాధులకు కారణమవుతాయి. అందుకే ఆశ కార్యకర్తలు ప్రతి ఇంటికి వెళ్లి డ్రై డేను అమలు చేయిస్తున్నారు. రోగాలబారిన పడకుండా కాపాడుతున్నారు.
స్వీయ నియంత్రణ తప్పనిసరి
సీజనల్ వ్యాధుల నుంచి మనల్ని మనం రక్షించుకోవాలంటే ఇంటి పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవడం చాలా అవసరం. ఇంటి పరిసరాల్లో చెత్తా చెదారం చేరకుండా చర్యలు తీసుకోవాలి. కాచి చల్లార్చిన నీటినే తాగాలి. ఇంటి పరిసరాల్లోని నీటి కుంటలను మట్టితో కప్పాలి. వాడుకునే నీటిలో తోకపురుగులుంటే వెంటనే డ్రమ్ములు, సంపులు ఖాళీ చేయాలి. జ్వరం, తలనొప్పి, కాళ్లనొప్పులు నాలుగు రోజులకు మించి ఉన్నాయంటే ఆలస్యం చేయకుండా వైద్యులను సంప్రదించాలి.