సిటీబ్యూరో, మే 27, (నమస్తే తెలంగాణ) : వచ్చే వర్షాకాలంలో శక్తి వంచన లేకుండా పనిచేయాలని ఎండీ సుదర్శన్‌రెడ్డి సూచించారు. ఖైరతాబాద్‌లోని ప్రధాన కార్యాలయంలో జలమండలి అధికారులతో సోమవారం సమావేశం నిర్వహించిన ఆయన.. వర్షాకాలం ప్రణాళికను ప్రకటించారు. మరో వారం రోజుల్లో వర్షాకాలం ప్రారంభమయ్యే నేపథ్యంలో డైరెక్టర్లు మొదలుకొని క్షేత్ర స్థాయి సిబ్బంది వరకు అంతా అప్రమత్తంగా ఉండాలని ఎండీ సుదర్శన్‌రెడ్డి ఆదేశించారు.
తాగునీటి సరఫరా, మురుగు నీటి నిర్వహణపై దృష్టి సారించాలని పేర్కొన్నారు. కలుషిత నీరు సరఫరా కాకుండా అందులో తగిన మోతాదులో క్లోరిన్ ఉండేలా చూసుకోవాలని ఆదేశాలు జారీ చేశారు. సీవరేజీ ఓవర్ ఫ్లోను సీరియస్‌గా తీసుకుని ఎకడా సమస్యలు తలెత్తకుండా చూడాలని చెప్పారు. వివిధ అంశాలపై వచ్చే ఫిర్యాదులను అరగంటలో పరిషరించాలన్నారు. సీవరేజీ ఓవర్ ఫ్లోతో పాటు కలుషిత నీటి సరఫరా వంటి వాటిపై వచ్చే ఫిర్యాదులను అరగంటలో పరిషరించాలని ఆదేశించారు.
వాటర్ హాట్ స్పాట్లు గుర్తించి, ముందస్తు జాగ్రత్త చర్యలు చేపట్టాలన్నారు. మ్యాన్ హోళ్లకు సేఫ్టీ గ్రిల్స్ బిగింపు, ప్రమాదకర మ్యాన్ హోళ్ల వద్ద రెడ్ ఫ్లాగ్స్, సూచిక బోర్డులు, హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయాలని వివరించారు. వర్షాకాలంలో కలుషిత నీటి సమస్యలను త్వరితగతిన పరిషరించేందుకు పొల్యూషన్ ఐడెంటిఫికేషన్ యంత్రాలను సమర్థంగా ఉపయోగించుకోవాలని ఎండీ సూచించారు .జలమండలి, జీహెచ్ఎంసీ 120 వాటర్ లాగింగ్ పాయింట్లను నిత్యం పర్యవేక్షించాలని ఎండీ సుదర్శన్‌రెడ్డి తెలిపారు.
మ్యాన్ హోళ్ల నుంచి తీసిన వ్యర్థాలను (సిల్ట్) ఎప్పటికప్పుడు తొలగించాలని ఆదేశించారు. మంచి నీటి పైపులైన్ నాలా క్రాసింగ్ వద్ద చెత్త చేరకుండా సంబంధిత అధికారులు జాగ్రత్త వహించాలని సూచించారు. ముంపునకు గురైన మ్యాన్‌హోళ్ల వద్ద హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయాలన్నారు. రహదారుల మీద ఉన్న మ్యాన్హోళ్లకి ఎరుపు రంగు వేయాలని ఎండీ ఆదేశించారు. డీప్ మ్యాన్ హోళ్ల దగ్గర సీవరేజీ సూపర్ వైజర్లు ఉండేలా చూడాలన్నారు.
జీహెచ్ఎంసీ, పోలీస్ శాఖల అధికారులను సమన్వయం చేసుకుంటూ పనిచేయాలని ఎండీ సుదర్శన్ రెడ్డి సూచించారు. నగర ప్రజలు ఎట్టి పరిస్థితుల్లోనూ మ్యాన్ హోళ్ల మూతలను తెరవకూడదని ఎండీ విజ్ఞప్తి చేశారు. ఎకడైనా మ్యాన్ హోల్ మూత ధ్వంసమైనా, తెరిచి ఉంచినట్లు గమనించినా.. జలమండలి కస్టమర్ కేర్ నంబర్ 155313 కి ఫోన్ చేసి సమాచారం ఇవ్వాలని కోరారు. జీహెచ్ఎంసీ పరిధిలో 5,767 కిలో మీటర్ల సీవరేజీ నెట్ వర్ ఉండగా.. శివారు మున్సిపాలిటీల పరిధిలో 4,200 కిలో మీటర్లు ఉందని ఎండీ వివరించారు.
జీహెచ్ఎంసీ, శివారు మున్సిపాలిటీల పరిధిలో దాదాపు 6,34,919 మ్యాన్ హోళ్లు ఉండగా, అందులో డీప్ మ్యాన్‌హోళ్లు 63,221 ఉన్నాయన్నారు. జీహెచ్ఎంసీ పరిధిలో 26,798, శివారు మున్సిపాలిటీల పరిధిలో 36,423 ఉండగా… జీహెచ్ఎంసీ పరిధిలో ఉన్న దాదాపు అన్ని డీప్ మ్యాన్‌హోళ్లకు ఇప్పటికే సేఫ్టీ గ్రిల్స్ ఏర్పాటు చేసినట్లు చెప్పారు. శివారు మున్సిపాలిటీల పరిధిలో ఉన్న వాటికి గ్రిల్స్ బిగింపు పనులు ఊపందుకున్నాయన్నారు. ఈ సమావేశంలో ఆపరేషన్స్ డైరెక్టర్-1 అజ్మీరా కృష్ణ, రెవెన్యూ డైరెక్టర్ వీఎల్ ప్రవీణ్ కుమార్, ఆపరేషన్స్ డైరెక్టర్-2 స్వామి, సీజీఎంలు, జీఎంలు, డీజీఎంలు, మేనేజర్లు పాల్గొన్నారు.
ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్.. వర్షాకాలంలో కీలకంగా వ్యవహరిస్తుంది. విపతర సమయాల్లో ఈ బృందం సహాయక చర్యలు అందిస్తుంది. అత్యవసర పరిస్థితులు ఎదురైనప్పుడు అకడికి చేరుకుని రక్షణ చర్యలు చేపడుతుంది. ఇది జీహెచ్ఎంసీ డిజాస్టర్ మేనేజ్ మెంట్ టీమ్‌తో కలిసి సమన్వయం చేసుకుని పనిచేస్తుంది.
ఇది జలమండలికి సంబంధించి ప్రత్యేక భద్రతా బృందం. వివిధ పని ప్రదేశాల్లో భద్రతా చర్యలు పాటిస్తున్నారా లేదా అనేది పరిశీలిస్తుంది. అన్ని ఓ అండ్ ఎం సైట్లలో తనిఖీలు నిర్వహించి.. భద్రతా నియమాలు పాటించేలా చర్యలు తీసుకుంటారు. పని జరిగే ప్రదేశాల్లో సూచికలు ఏర్పాటు మొదలు.. జియో ట్యాగింగ్ వరకు పనులు చేస్తారు. డివిజన్‌కు ఒక బృందాన్ని కేటాయించారు.
జీహెచ్ఎంసీ ద్వారా గుర్తించిన వాట్ లాగింగ్ పాయింట్స్, మ్యాన్‌హోల్స్ తదితర అంశాలతో క్షేత్రస్థాయిలో మేనజర్లు ఈ మాన్ సూన్ మేనేజ్ మెంట్ ప్లాన్ సిద్ధం చేసుకోవాలి. రోజూ వారీ పరిధిలో పర్యటించి డైలీ సిచువేషన్ రిపోర్ట్ (డీఎస్ఆర్) తయారు చేసి ఉన్నతాధికారులకు పంపించాలి. అలాగే వాటర్ లాగింగ్ పాయింట్ దగ్గర ఒక వ్యక్తిని నియమించి.. పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలి.