సిటీబ్యూరో, జనవరి 9 (నమస్తే తెలంగాణ): వేసవిలో నీటి డిమాండ్‌ను ఎలా ఎదుర్కొవాలనే అంశంపై ఎండీ అశోక్‌రెడ్డి, ఈడీ మయాంక్ మిట్టల్ జలమండలి అధికారులతో సమీక్ష నిర్వహించారు. గత వేసవిలో అధికంగా ట్యాంకర్లు బుక్ చేసుకున్న ప్రాంతాల అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. గతేడాది ట్యాంక్ బుకింగ్, నీటి సరఫరా, డెలివరీ తదితర వివరాలను పరిశీలించారు. ఈ సారి నీటి డిమాండ్‌ను మరింత సమర్థంగా ఎదుర్కోవాలని ఎండీ సూచించారు. అందుకు అవసరమైన అన్ని సౌకర్యాలను సమకూరుస్తామని హామీ ఇచ్చారు.
అవసరమైతే ట్యాంకర్లు, ఫిల్లింగ్ స్టేషన్లు, నీటి మోతాదు పెంచుతామని చెప్పారు. గతంలో అధికంగా ట్యాంకర్లు బుక్ చేసిన వినియోగదారులను సర్వే చేసి గుర్తించినట్లు అధికారులు వివరించారు. బోర్లు, భూగర్భ జలాలు ఎండిపోవడంతో ఈ పరిస్థితి వచ్చిందని చెప్పారు. ఈ వినియోగదారుల ఇళ్లల్లో సర్వే చేపట్టామని పేర్కొన్నారు. ఇంకుడు గుంతలు నిర్మించుకునేలా అవగాహన కల్పించాలని ఎండీ సూచించారు. ట్యాంకర్ల యజమానులతో సమావేశమయ్యారు. వేసవిలో ట్యాంకర్లపరంగా ఎలాంటి ఇబ్బందులు రాకుండా కావాల్సిన అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. వారి నుంచి వినతులు స్వీకరించి వాటిని పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఈఎన్సీ, రెవెన్యూ డైరెక్టర్ వీఎల్ ప్రవీణ్‌కుమార్, డైరెక్టర్ స్వామి, సీజీఎం, ఇతర అధికారులు పాల్గొన్నారు.