బంజారాహిల్స్,జూలై 9: బోనాలపండుగ సందర్భంగా ఆలయాలవద్ద ఎలాంటి ఇబ్బందులు లేకుండా జీహెచ్ఎంసీ అధికారులు తగు చర్యలు తీసుకోవాలని జీహెచ్ఎంసీ మేయర్ గద్వాల్ విజయలక్ష్మి ఆదేశించారు. బుధవారం బంజారాహిల్స్ డివిజన్‌కు చెందిన 17 ఆలయాల నిర్వాహకులకు బోనాల పండుగ ఏర్పాట్ల కోసం దేవాదాయశాఖ ద్వారా మంజూరయిన చెక్కులను మేయర్ గద్వాల్ విజయలక్ష్మి అందజేశారు. ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ.. అమ్మవారి ఆలయాల వద్ద పారిశుధ్య సమస్యలు లేకుండా నిరంతరం పనులు చేపట్టాలని, బోనాలు తీసుకువెళ్లే మహిళలకు ఇబ్బందులు లేకుండా నిర్వాహకులు ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు.
జూబ్లీహిల్స్ డివిజన్లో..
జూబ్లీహిల్స్ డివిజన్ పరిధిలోని 33 అమ్మవారి ఆలయాలకు బోనాల పండుగ కోసం రాష్ట్ర ప్రభుత్వం నుంచి మంజూరయిన 33 చెక్కులను దేవాదాయశాఖ అధికారులు బుధవారం పంపిణీ చేశారు. బంజారాహిల్స్‌లోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో దేవాదాయశాఖ అధికారి శేఖర్ చేతులమీదుగా చెక్కులను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక నేతలు మామిడి నర్సింగరావు, ఎల్లయ్య, తదితరులు పాల్గొన్నారు.