సిటీబ్యూరో, ఏప్రిల్ 10 (నమస్తే తెలంగాణ) : జీహెచ్ఎంసీ పరిధిలోని దివ్యాంగులు, సీనియర్ సిటిజన్లకు ఉపకరణాలు, సహాయక పరికరాలు అర్హులైన వారికి సరిళ్ల వారీగా అందజేస్తామని నగర మేయర్ గద్వాల్ విజయలక్ష్మి తెలిపారు. సోమవారం జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో యూసీడీ విభాగం ద్వారా ఏర్పాటు చేసిన దివ్యాంగులకు, సీనియర్ సిటిజన్లకు ఉపకరణాలు, సహాయక పరికరాలు, కృత్రిమ అవయవాల పంపిణీ కార్యక్రమం డిప్యూటీ మేయర్ మోతె శ్రీలతాశోభన్రెడ్డితో కలిసి మేయర్ ప్రారంభించారు. అర్హులైన దివ్యాంగులకు ట్రై సైకిల్, చేతి కర్రలు, వీల్ చైర్స్ను 47 మందికి పంపిణీ చేశారు. జీహెచ్ఎంసీ అలిమ్ కో సంస్థ ద్వారా ఏర్పాటు చేసిన గుర్తింపు శిబిరాలలో 4,456 లబ్ధిదారులకుగాను రూ.3. 86 కోట్ల విలువ గల 9,250 పరికరాలు కొనుగోలుకు ప్రతిపాదించామని మేయర్ వివరించారు.
ప్రస్తుతం అన్ని ధ్రువీకరణ పత్రాలతో క్యాంపులకు హాజరైన 3,619 మంది అర్హులైన లబ్ధిదారులకు రూ. 3. 15 కోట్ల విలువగల 7,576 కృత్రిమ అవయవాలు, పరికరాలు, జీహెచ్ఎంసీ సొంత నిధులతో ఉచితంగా పంపిణీ చేస్తుందని తెలిపారు. మిగిలిన 837 మంది దివ్యాంగులు సదరం సర్టిఫికెట్, ఫుడ్ సెక్యూరిటీ కార్డులు అందజేసిన తర్వాత పంపిణీ చేస్తామని పేర్కొన్నారు. సదరం సర్టిఫికెట్ గురించి డీపీవోలు చర్యలు తీసుకోవాలని తెలిపారు. దివ్యాంగులు, సీనియర్ సిటిజన్లు తమకు సంబంధించిన పరికరాలుపొందేందుకు ఇంతకు ముందు ఆయా సరిళ్లలో ఏర్పాటు చేసి న గుర్తింపు క్యాంపుల ప్రదేశాల వద్దనే అర్హులైన వారికి పంపిణీ చేస్తామని మేయర్ సూచించారు.