సిటీబ్యూరో, జనవరి 22 (నమస్తే తెలంగాణ) : ప్రజావాణిలో అందిన ఫిర్యాదులను వారం రోజుల్లో పరిష్కరించాలని మేయర్ గద్వాల్ విజయలక్ష్మి అన్నారు. సోమవారం జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో ప్రజావాణి కార్యక్రమం సందర్భంగా మేయర్ గద్వాల్ విజయలక్ష్మి, డిప్యూటీ మేయర్ మోతె శ్రీలత శోభన్‌రెడ్డి ప్రజల నుంచి విన్నపాలు స్వీకరించారు. 86 దరఖాస్తులను స్వీకరించగా, 62 విన్నపాలు హౌసింగ్‌కు సంబంధించినవి ఉన్నాయని మేయర్ తెలిపారు.
ప్రజావాణిలో వచ్చిన అర్జీలను పరిష్కరించి నివేదికను ప్రతి శనివారం అందజేయాలని మేయర్ అధికారులను ఆదేశించారు. ప్రతి ఆర్జీకి రశీదు స్వీకరించిన ప్రతి దరఖాస్తును వారం రోజుల్లోనే పరిష్కరించాలని ఆదేశించారు. అర్జిదారుడికి ఎన్ని రోజుల్లో పరిష్కరించబడుతుందని లిఖిత పూర్వకంగా అధికారులు తెలియజేయాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో ఈఎన్సీ జియావుద్దీన్, అదనపు కమిషనర్లు ఉపేందర్‌రెడ్డి, యాదగిరి రావు, జయరాజ్ కెనడి, సరోజ, ప్రేమ్ చందర్‌రెడ్డి, సీసీపీ రాజేంద్ర ప్రసాద్ నాయక్, సీఈ దేవానంద్, కిషన్, హౌజింగ్ ఓఎస్డీ సురేష్‌కుమార్, చీఫ్ హెల్త్ ఆఫీసర్ డాక్టర్ పద్మజ, చీఫ్ ఎంటమాలజీ డాక్టర్ రాంబాబు, ఎస్డబ్ల్యూఎం ఎస్ఈ కోటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.