సిటీబ్యూరో, ఏప్రిల్ 16 (నమస్తే తెలంగాణ) : గ్రేటర్లో భిన్న వాతావరణం నెలకొంది. పగలంతా నిప్పులు కురిపించే ఎండలు, సాయంత్రానికి ఈదరు గాలులతో కూడిన వర్షంతో జనం ఉక్కిరిబిక్కిరయ్యారు. గురువారం గ్రేటర్లో రికార్డు స్థాయి ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఈ సీజన్లో తొలిసారిగా పగటి ఉష్ణోగ్రతలు 41 డిగ్రీలుగా నమోదయ్యాయి. దీంతో ఎండ వేడికి తట్టుకోలేక జనం అతలాకుతలమయ్యారు.
ఉదయం 8గంటల నుంచే భానుడు తన ప్రతాపాన్ని చూపుతున్నాడు. మధ్యాహ్న సమయానికి భానుడు ప్రచ్ఛండ భానుడిగా నిప్పులు గక్కాడు. దీంతో జనం పగలు సమయంలో బయటకు రావడానికి జంకుతున్నారు. గురువారం ఉదయం నుంచి రాత్రి వరకు నగరంలో గరిష్ట ఉష్ణోగ్రతలు 41.0 డిగ్రీలు, కనిష్ట ఉష్ణోగ్రతలు 28.4 డిగ్రీలు, గాలిలో తేమ 35 శాతంగా నమోదైనట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు వెల్లడించారు.
మరోవైపు క్యూములోనింబస్ మేఘా ల ప్రభావంతో సాయంత్రం వేళ పలు చోట్ల ఉరుములు, మెరుపులు, ఈదురు గాలులతో కూడిన వర్షం కురిసింది. రాత్రి 10.30గంటల వరకు కుత్బుల్లాపూర్ ప్రాంతంలో అత్యధికంగా 2.50సెం.మీలు, గాజులరామారంలో 1.28సెం.మీలు, కాప్రాలో 1.0సెం.మీల చొప్పున వర్షపాతం నమోదైంది.