సిటీబ్యూరో, అక్టోబర్ 6 (నమస్తే తెలంగాణ): దసరా పండుగ సెలవులు ముగియడంతో నగర వాసులు తమ స్వగ్రామాల నుంచి తిరుగుముఖం పట్టడంతో నగర నలువైపులా ఉన్న రహదారులు ట్రాఫిక్‌తో కిక్కిరిసిపోయాయి. ఆదివారం సాయంత్రం నుంచి ఇదే పరిస్థితి ఉన్నా… సోమవారం ఉదయం నుంచి ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా ముందస్తు చర్యలు తీసుకోవాల్సిన పోలీసులు చేతులెత్తేశారు. దీంతో నగర శివార్లలో ఎక్కడికక్కడ ట్రాఫిక్ స్తంభించిపోయింది. బస్సులు, ప్రైవేట్ వాహనాల్లో వచ్చే వాళ్లంతా శివారు ప్రాంతాల్లో ఉన్న మెట్రో స్టేషన్లకు బారులు తీరారు. దీంతో ఎల్బీనగర్, నాగోల్, జుబ్లీబస్స్టేషన్, మియాపూర్ ప్రాంతాల్లోని మెట్రో స్టేషన్లు ప్రయాణికులతో కిక్కిరిసిపోయాయి.
ఎల్బీనగర్లో ఈ తీవ్రత మరింతగా కన్పించింది. దీంతో ఆ రూట్లో ఎక్కడికక్కడే ట్రాఫిక్ స్తంభించిపోయి, పాదచారులు కూడా నడువలేని పరిస్థితి నెలకొంది. సాధారణంగా సోమవారం నగరంలోకి వచ్చే వాహనాల సంఖ్య ఎక్కువగా ఉంటుంది. శని, ఆదివారాల్లో తమ స్వగ్రామాలకు వెళ్లి సోమవారం ఉదయం తమ పనుల నిమిత్తం నగరానికి వస్తుంటారు. స్కూళ్లకు దసరా సెలవులు రావడంతో సోమవారం నుంచి స్కూల్స్ అన్ని తిరిగి ప్రారంభమయ్యాయి. దీంతో పండుగ సెలవులకు తమ స్వగ్రామాలకు వెళ్లిన వారంతా తిరిగి ఆదివారం నుంచి నగరానికి తిరుగు ముఖం పెట్టారు. ఆదివారం కూడా నగరానికి వచ్చే వాహనాలతో శివారు ప్రాంతాలలోని రహదారులన్ని నిండిపోయాయి. అలాగే సోమవారం ఉదయం కూడా అదే పరిస్తితి నెలకొంది.
నల్గొండ జిల్లా చిట్యాల ప్రాంతంలో రోడ్డు ప్రమాదం జరగడంతో అటు వైపు నుంచి నగరానికి వచ్చే వాహనాలు ఆగిపోయాయి, ఘటన స్థలంలోని వాహనాలను పక్కకు తొలగించి, పరిస్థితిని యధాస్థితికి తీసుకొచ్చే వరకు సుమారు గంటకుపై సమయం పట్టిందని వాహనదారులు పేర్కొన్నారు. ఔటర్ రింగ్ నుంచి ఎల్బీనగర్ వరకు ట్రాఫిక్ ఎక్కడికక్కడే స్తంబించి పోయింది. ఇక నగరంలోకి రాగానే ఎల్బీనగర్ మెట్రో స్టేషన్ నుంచి తమ గమ్యస్థానాలకు త్వరగా చేరుకోవాలని భావించారు.
ఇలా ఒక్కసారిగా వాహనాలు నగరంలోకి వరదలా రావడం, ప్రయాణికులు అక్కడ దిగడంతో ఎల్బీనగర్లో ట్రాఫిక్ ఎక్కడికక్కడే స్తంభించింది. మెట్రో స్టేషన్‌కు పాదాచారులు క్యూ కట్టారు. మెట్రో స్టేషన్లో ప్రయాణికులతో కిక్కిరిసిపోయింది. మెట్రో స్టేషన్లలోని ఎస్కలేటర్లు, లిప్ట్‌లు కూడా ఆగిపోయాయి. నాగోల్ వైపు కూడా అదే పరిస్థితి నెలకొంది. శామీర్‌పేట్, మేడ్చల్ వైపు నుంచి వచ్చే వారితో సికింద్రాబాద్ జుబ్లీబస్స్టేషన్ ప్రాంతం కిక్కిరిసిపోయింది. ఈ ట్రాఫిక్ రద్దీని ఉహించని పోలీసులు కొద్దిసేపు చేతులెత్తేసిన పరిస్థితి ఏర్పడింది.
ఎల్బీనగర్ పరిసర ప్రాంతాల్లో క్యాబ్‌లు, ఆటోలు, ద్విచక్రవాహనాల బుకింగ్ కాలేదని ప్రయాణికులు వాపోయారు. ప్రయాణికుల రద్దీ నేపధ్యంలో ఒక్కో ఆటోకు, క్యాబ్‌కు ఒకేసారి 10 నుంచి 20 బుకింగ్స్ రావడంతో కొందరు ఎటు వెళ్లాలో తెలియక తమ రైడింగ్‌ను నిలిపివేసుకున్నారు, మరికొందరు బుకింగ్స్ కాకుండా నేరుగా ప్రయాణికులతో ఛార్జీలు మాట్లాడుకొని వెళ్లారు. ఇంకా కొందరు ఎక్కువ మొత్తం ఇస్తేనే బుకింగ్ యాక్సెప్ట్ చేశారంటూ ప్రయాణికులు ఆవేదన వ్యక్తం చేశారు.
సాధారణంగా మన్సురాబాద్ నుంచి చంపాపేట్‌కు సుమారు రూ. 80 నుంచి రూ. 120 వరకు ఆటో వస్తుండగా, సోమవారం రూ. 240 బుకింగ్ జరిగిందని ఓ ప్రయాణికుడు వెల్లడించాడు. ఇలా ఎక్కువ ప్రయాణికుల రద్దీతో రైడింగ్ యాప్‌లపై కూడా దాని ప్రభావం పడింది. సోమవారం మధ్యాహ్నం వరకు ఇలాంటి పరిస్థితి నెలకొని ఆ తరువాత సాధారణ పరిస్థితులు నెలకొన్నాయి.