హైదరాబాద్: భారీ వర్షాలతో ఉగ్రరూపం దాల్చిన మూసీ నది (Musi River) శాంతించింది. జంట జలాశయాలైన హిమాయత్ సాగర్, ఉస్మాన్ సాగర్‌కు వరద తగ్గింది. దీంతో మూసీలోకి వదిలే నీరు కూడా తగ్గుముఖంపట్టింది. ఈ నేపథ్యంలో మూసీ నదిలో వరద ఉధృతి తగ్గిపోయింది. దీంతో చాదర్‌ఘాట్ లోయర్ బ్రిడ్జి కింది నుంచి వరద వెళ్తున్నది. అయితే వంతెనపై చెత్త, మట్టి చేరడంతో బురదమయమయింది. దీంతో బ్రిడ్జిపై నుంచి వాహనాలు ఇంకా అనుమతించడం లేదు. శుక్రవారం సాయంత్రం లోయర్ బ్రిడ్జి నీట మునిగిన విషయం తెలిసిందే. మూసీ ఉధృతితో బ్రిడ్జి పై 10 అడుగుల ఎత్తు నుంచి వరద ప్రవహించింది. కాగా, అప్పర్ బ్రిడ్జి పైనుంచి మాత్రమే వాహనాలను అనుమతిస్తుండటంతో చాదర్‌ఘాట్ పరిసరాల్లో ట్రాఫిక్ భారీగా జామ్ అయింది. కోఠి నుంచి చాదర్‌ఘాట్ వరకు వాహనాలు నిలిచిపోయాయి.
ఇక ఉస్మాన్‌సాగర్‌కు వరద ప్రవాహం క్రమంగా తగ్గుతున్నది. ప్రస్తుతం 1,100 క్యూసెక్కుల వరద వస్తుండగా, 884 క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నారు. ఉస్మాన్‌సాగర్ పూర్తిస్థాయి నీటినిల్వ 3.9 టీఎంసీలు కాగా, ప్రస్తుతం 3.65 టీఎంసీలు ఉన్నాయి. మరోవైపు హిమాయత్ సాగర్‌కు కూడా వరద తగ్గిపోయింది. ఇన్‌ఫ్లో 4 వేల క్యూసెక్కులుగా ఉండగా, ఔట్‌ఫ్లో 3,963 క్యూసెక్కులుగా ఉంది. హిమాయత్‌సాగర్ పూర్తిస్థాయి నీటినిల్వ 2.97 టీఎంసీలు, ఇప్పుడు 2.64 టీఎంసీలు ఉన్నాయి.