BRS | మణికొండ, నవంబర్ 15: రాజేంద్రనగర్ నియోజకవర్గంలో వివిధ పార్టీల నుంచి బీఆర్ఎస్లో చేరేందుకు నాయకులు, యువత సిద్ధమవుతున్నారు. ఇటీవల నియోజకవర్గ ఎమ్మెల్యే ప్రకాశ్‌గౌడ్ కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్న విషయం తెలిసిందే. ఆయనతో పాటు కొంత మంది నాయకులు నామినేటెడ్ పదవులు ఆశించి కాంగ్రెస్ కండువా కప్పుకున్నట్లు వినికిడి. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీ క్షేత్రస్థాయిలో నాయకులు, కార్యకర్తల సమాయత్వం అవుతున్న సందర్భంలో వివిధ పార్టీల నాయకులు, కార్యకర్తలు బీఆర్ఎస్లో చేరేందుకు సుముఖత వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో నియోజకవర్గ ఇన్చార్జి కార్తీక్‌రెడ్డి నేతృత్వంలో పార్టీలో చేరేందుకు సర్పంచ్‌లు, ఎంపీటీసీలు సైతం మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తున్నది.
మణికొండ మున్సిపాలిటీ నుంచి 150 మంది నార్సింగి, బండ్లగూడ మున్సిపాలిటీల నుంచి వివిధ పార్టీలకు చెందిన మరో 100 మంది నాయకులు, కార్యకర్తలు బీఆర్ఎస్ పార్టీలో చేరేందుకు నేడు రంగం సిద్ధం చేశారు. నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ ఇన్చార్జి పట్లోళ్ల కార్తీక్‌రెడ్డి నేతృత్వంలో నాయకులు, కార్యకర్తలు శనివారం ఉదయం 11 గంటలకు బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారకరామారావు సమక్షంలో తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ పార్టీలో చేరనున్నట్లు మణికొండ బీఆర్ఎస్ అధ్యక్షుడు సీతారాం ధూళిపాళ తెలిపారు. మణికొండ మున్సిపాలిటీలో బీఆర్ఎస్ పార్టీ పటిష్టంగా ఉందని, నార్సింగి, బండ్లగూడ మున్సిపాలిటీల్లోనూ పార్టీ క్యాడర్ ఎక్కడ పార్టీ మారలేదని నియోజకవర్గ వ్యాప్తంగా పార్టీని పటిష్ట పరిచేందుకు యువ నేత కార్తీక్‌రెడ్డి నేతృత్వంలో ముందుకు సాగుతున్నామని ఆయన తెలిపారు. త్వరలోనే నియోజకవర్గంలో కార్తీక్‌రెడ్డి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున బీఆర్ఎస్ పార్టీ కార్యక్రమాలు చేపడతామని ఈ సందర్భంగా సీతారాం పేర్కొన్నారు.