Maheshwaram | బడంగ్ పేట్, జూన్ 22 : ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలంగాణ రాష్ట్ర పరువు తీస్తున్నారని మాజీ మంత్రి ఎమ్మెల్యే పి సబితా ఇంద్రారెడ్డి ఆరోపించారు. మహేశ్వరం మండలం మన్సాన్పల్లి గ్రామానికి చెందిన మర్యాద రాఘవేందర్ రెడ్డితో పాటు వందలాది మంది కార్యకర్తలు మాజీ మంత్రి, మహేశ్వరం ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరారు. వారందరికీ ఆమె గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ప్రచార రథంతో భారీ ఊరేగింపుగా ప్రజలు తరలివచ్చి సబిత ఇంద్రారెడ్డికి ఘన స్వాగతం పలికారు. దేవాలయంలో ప్రత్యేక పూజలు చేసి సభా స్థలికి భారీ ర్యాలీగా తరలివచ్చారు.
ఈ సందర్భంగా సబితా ఇంద్రారెడ్డి మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారం కోసం అమలు కాని వాగ్దానాలు ఎన్నో ఇచ్చి అమలు చేయలేక కొరుక్కుని తినండి, నరుక్కొని తినండి, దొంగల్లా చూస్తున్నారని ఆయన ముఖ్యమంత్రి స్థానంలో ఉండి ఇలా మాట్లాడొచ్చా అని ప్రశ్నించారు. తెలంగాణ రాష్ట్ర ఆత్మగౌరవాన్ని బజారుకు ఈడుస్తున్నారని ఆమె ఆందోళన వ్యక్తం చేశారు. పెన్షన్లు ఇవ్వకుండా.. రోజుకో సర్వే, రోజుకో మాట చెప్పి చెప్పి ప్రజలను అయోమయంలో పడవేస్తున్నారని ఆమె మండిపడ్డారు. అర్హత ఉన్న వాళ్ళందరికీ ఇందిరమ్మ ఇల్లు ఇవ్వవలసిందే అన్నారు. అర్హులకు కాకుండా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు ఇస్తే చూస్తూ ఊరుకునేది లేదన్నారు. అధికారం ఉంది కదా అని ఇస్టానుసారంగా వ్యవహరిస్తే ప్రజల ఆగ్రహానికి గురికాక తప్పదన్నారు. ప్రజా సంక్షేమాన్ని గాలికి వదిలేసి కేసీఆర్ను తిట్టడమే పనిగా పెట్టుకున్నారని ఆమె ఆరోపించారు. ప్రభుత్వ పథకాలన్నీ అర్హులకు అందించాలన్నారు. రాజీవ్ యువకిరణాలకు సంబంధించిన లోన్స్ ఎందుకు ఇవ్వడం లేదన్నారు. మూడు లక్షల రూపాయల కోసం యువతను ముప్పు తిప్పలు పెడుతున్నారని ఆమె విమర్శించారు.