Hyderabad | కుత్బుల్లాపూర్, మే 19: పెద్దలు కుదిర్చిన సంబంధంతో ఒక్కటయ్యారు. పెద్ద మొత్తంలో కట్నకానుకలు అందజేసి అంగరంగ వైభవంగా పెండ్లిచేశారు. వీరి కాపురం సాఫీగా సాగుతుందని అనుకుంటున్న సమయంలోనే ఓ ఫోన్‌కాల్‌తో కొత్తజంటకు బ్రేక్ పడింది. వారం రోజులకే భర్త నిజస్వరూపం బయట పడింది. భర్త వేదింపులు తాళలేక నవ వివాహిత పైండ్లెన 13 రోజులకే తనువుచాలించింది. ఈ సంఘటన పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో శుక్రవారం చోటుచేసుకున్నది.
సీఐ ప్రశాంత్ తెలిపిన వివరాల ప్రకారం… కుత్బుల్లాపూర్ సర్కిల్ బాపునగర్ ప్రాంతానికి చెందిన నర్సింహారెడ్డి కూతురు నిషిత(24)ను మేడ్చల్ మండలం డబిల్పూర్ గ్రామానికి చెందిన శ్రీరామ్‌రెడ్డి కొడుకు సంతోష్‌రెడ్డి(27)తో ఈ నెల 5న పెండ్లి చేశారు. వివాహ సమయంలో కట్నకానుకల కింద 60తులాల బంగారం, ఇతర సామాన్లు, 2 కేజీల వెండి అందించారు. పెండ్లి అయన వారం పది రోజుల్లో అమ్మాయి పేరుమీద ఉన్న గుమ్మడిదలలోని 550 గజాల ప్లాట్‌ను సైతం రిజిస్ట్రేషన్ చేయిస్తామని ఒప్పందం కుదుర్చుకున్నారు.
పెండ్లి అయిన అనంతరం డబిల్పూర్లోని అత్తగారి ఇంటికి వెళ్లిన తర్వాత కొద్ది రోజులకే నిషిత ఫోన్లో స్నేహితులతో కలిసి దిగిన ఫొటోలు ఉన్నాయి. వాటిని చూసిన భర్త సంతోష్ రెడ్డి భార్యను నిలదీయడంతో పాటు అనుమానించడం మొదలు పెట్టాడు. ఇద్దరి మధ్యన మాటామాట పెరగడంతో ఈ నెల 17న భార్యను తీసుకువచ్చి చింతల్ బాపూనగర్‌లోని తల్లిగారి ఇంటివద్ద వదిలిపెట్టాడు. అదే సమయంలో నిషిత తన తండ్రితో దిగిన ఫొటోను చూపుతూ అసభ్య పదజాలంతో దూషించాడు. అంతేకాకుండా తనకు ఇస్తానన్న ప్లాట్‌ను రిజిస్ట్రేషన్ చేయించిన తర్వాతే కాపురానికి తీసుకు వెళ్తానని హెచ్చరించి వెళ్లిపోయాడు.
తిరిగి 18న మధ్యాహ్నం సమయంలో వచ్చి నిషిత ఫోన్లో ఉన్న నంబర్లు, ఇతర సమాచారం తీసుకునే ప్రయత్నం చేశాడు. ఇవ్వక పోవడంతో ఫోన్‌ను లాక్కొని వెళ్లాడు. రాత్రి 10 గంటల సమయంలో ఫోన్లో అల్లుడితో ఇంట్లోవారంతా మాట్లాడుతున్న సమయంలో కూతురు నిషిత గ్రౌండ్‌ఫ్లోర్‌కు వచ్చి చీరతో ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నది. కుటుంబ సభ్యులు కిందకు వచ్చి చూసేలోపే ప్రాణాలు కోల్పోయింది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ వైద్యశాలకు తరలించారు. మృతురాలి తండ్రి నర్సింహారెడ్డి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.