కంటోన్మెంట్, ఫిబ్రవరి 5: ఓ వ్యక్తిని హత్య చేసిన నిందితుడిని మార్కెట్ పోలీసులు అరెస్టు చేసి, రిమాండ్‌కు తరలించారు. సోమవారం నార్త్ జోన్ డీసీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో అదనపు డీసీపీ మధుసూదన్ రావు, మహంకాళి ఏసీపీ రవీందర్, మార్కెట్ ఇన్స్పెక్టర్ రామకృష్ణ ఈ కేసు వివరాలను వెల్లడించారు. నిజామాబాద్ బోధన్ రోడ్డులోని సారంగపూర్ గ్రామానికి చెందిన మహ్మద్ మోసిన్ ఖాన్ (25) ఫుట్‌పాత్‌పై జీవనం సాగిస్తున్నాడు. మూడేళ్ల కిందట బతుకుదెరువు కోసం సికింద్రాబాద్‌కు వచ్చిన అతడు గాంధీ ఆస్పత్రి ఎదురుగా ఉన్న ఫుట్‌పాత్‌పై ఉంటూ.. కాలం వెల్లదీశాడు. తాగుడుకు బానిసైన ఖాన్ గత నెల 20న సికింద్రాబాద్ మార్కెట్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న యశోద ఆస్పత్రి వద్దకు మద్యం మత్తులో వచ్చాడు. అక్కడ ఓ వ్యక్తితో గొడవ పడ్డాడు. అతడి జేబులో ఉన్న రూ.800 లాక్కొని పారిపోసాగాడు.
అతడు పట్టుకునే ప్రయత్నం చేయగా.. ఖాన్ తన వద్దనున్న కత్తితో బాధితుడి ముఖం, శరీరంపై గాట్లు పెట్టి పారిపోయాడు. బాధితుడు రక్తపు మడుగులో పడిపోగా స్థానికులు 100కు కాల్చేసి సమాచారమిచ్చాడు. అక్కడికి వచ్చిన పోలీసులు గాయపడిన వ్యక్తిని గాంధీ ఆస్పత్రిలో చేర్పించగానే కొద్ది సేపటికే మరణించాడు. నిందితుడు ఖాన్ కోసం గాలించగా.. నిజామాబాద్‌లో పట్టుబడ్డాడు. ఖాన్ చేతిలో గాయపడిన మరో బాధితుడు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఇదిలా ఉండగా.. ఖాన్ చేతిన గాయపడి మృతిచెందిన వ్యక్తి వివరాలు ఇంకా తెలియరాలేదని పోలీసులు తెలిపారు.