Attapur | మైలార్‌దేవ్‌పల్లి, మే 31 : అత్తాపూర్ స్మశానవాటికకు వెళ్లాలంటేనే ప్రజలకు నరకం కనిపిస్తుందని అత్తాపూర్ డివిజన్ బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు అప్పారెడ్డి ముఖేష్, పుప్పాల లక్ష్మణ్‌లు అన్నారు. శనివారం డివిజన్ పరిధిలోని పలు ప్రాంతాల్లో బీఆర్ఎస్ నాయకులు పర్యటించి ప్రజా సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అత్తాపూర్ శ్మశానవాటికలో కనీస సౌకర్యాలు కరువైయ్యాయన్నారు. లోపల పూర్తిగా పిచ్చిమొక్కలు, చెట్లు పెరిగిపోయి నడిచేందుకు సైతం వీలు లేకుండా ఉందన్నారు. స్ట్రీట్ లైట్లు వెలకపోవడంతో రాత్రి సమయంలో పూర్తిగా అంధకారం నెలకొని ఉంటుందన్నారు. చెత్తాచెదారాలు, వ్యర్థాలు పేరుకుపోయి పూర్తిగా దుర్గంధభరితంగా మారిందన్నారు. అధికారుల పర్యవేక్షణ లోపం కారణంగా స్థానిక ప్రజలు శ్మశానవాటికకు వెళ్లాలంటేనే జంకుతున్నారన్నారు.
గోతులమయంగా రోడ్లు..
అత్తాపూర్ ప్రాంతంలో రోడ్లు పూర్తిగా గోతులమయంగా మారాయి. దీంతో వాహనాదారులు, ప్రజలు దారిలో ప్రయాణిస్తు అనేక ప్రమాదాలకు గురవుతున్నారు. వర్షం పడిన ప్రతిసారి ఈ గోతుల్లో నీరు చేరి ఎక్కడ రోడ్డు ఉందో ఎక్కడ గోతి ఉందో తెలియక ప్రజలు కిందపడి గాయాల బారిన పడుతున్నారన్నారు. అలాగే డ్రైనేజీ మ్యాన్‌హోల్స్ పూర్తిగా ధ్వంసమై ఉన్నాయన్నారు. పాతకాలం నాటి డ్రైనేజీలు ఉండడంతో అవి నిండుకోని రోడ్లపై ఏరులై పారుతున్నాయన్నారు. పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా డ్రైనేజీ వ్యవస్థను ఆధునీకరించాల్సిన అవసరం ఉందన్నారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు మల్లేష్‌యాదవ్ తదితరులున్నారు.