సిటీబ్యూరో, ఫిబ్రవరి 16(నమస్తే తెలంగాణ): మూసీ ప్రక్షాళన, సుందరీకరణ పేరిట వేలాది మంది బడుగు, బలహీన, పేద వర్గాలను ప్రభుత్వం ఇబ్బంది పెడుతోందని పలువురు పర్యావరణ వేత్తలు, సామాజిక కార్యకర్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మూసీ నది పరీవాహక ప్రాంత ప్రజల హక్కులను పరిరక్షించడమే లక్ష్యంగా ‘మూసీ జన్ ఆందోళన్’ కృషి చేస్తోంది. సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో సోమవారం ‘మూసీ జన్ ఆందోళన్’ ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. మూసీ ఒడ్డున నివసించే మంచిరేవుల, గంధంగూడ, హైదర్‌గూడ, బండ్లగూడ గ్రా మాల నివాసితులు, మూసీ ఎగువ, దిగువన ఉండే ప్రాంతవాసుల హక్కుల సాధనకు పోరాడుతున్నామన్నారు. ఈ క్రమంలో పలువురు సామాజిక కార్యకర్తలు పలు అంశాలను లేవనెత్తారు.
గోప్యంగా మూసీ ప్రాజెక్టు…!
డీపీఆర్ సిద్ధం చేశామని, మూసీ ప్రాజెక్టు అంశాలను వివరిస్తూ ఈ ఏడాది జనవరిలోనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అసెంబ్లీ వేదికగా ప్రకటన చేశారు. కానీ ఇప్పటివరకు నది సరిహద్దు, బఫర్ జోన్ల్, మ్యాపులకు సంబంధించిన వివరాలు, మూసీ నది తీర ప్రాంతం, అభివృద్ధితో ప్రభావితమయ్యే నిర్మాణాలు, గుర్తించిన మ్యాపులు వంటి విషయాలను బహిర్గతం చేయలేదని పర్యావరణవేత్తలు మండిపడుతున్నారు. ప్రస్తుతం డీపీఆర్ ఏ దశలో ఉందనే విషయాన్ని కూడా ఇప్పటికీ సర్కార్ ప్రకటించలేకపోతున్నదన్నారు. మూసీ ప్రక్షాళన పేరిట మూసీ జన్మించిన ప్రాంతాన్ని నిర్వీర్యం చేస్తుందన్నారు. ఇప్పటివరకు మూసీ ఎగువ ప్రాంతాల్లో చేపట్టాల్సిన అభివృద్ధి పనులపై దృష్టి పెట్టలేదున్నారు. తెలంగాణ సర్కారు ఇటీవల విడుదల చేసిన జీవో నంబర్ 921 ప్రకారం ఎన్నో అంశాలను తుంగలో తొక్కిందన్నారు.
మెగా రియల్ ఎస్టేట్ ప్రాజెక్టుగా మూసీ ప్రక్షాళన..!
ప్రజాప్రయోజనాలను తుంగలో తొక్కుతూ, మూసీ ప్రక్షాళన పేరిట రేవంత్ రెడ్డి సర్కార్ మెగా రియల్ ఎస్టేట్ ప్రాజెక్టును నిర్మిస్తుందని పర్యావరణవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మూసీ భూములను దోచేసేందుకు కాంగ్రెస్ సర్కార్ సిద్ధం అవుతుందన్నారు. మూసీ అభివృద్ధి కోసం తీసుకువచ్చిన జీవోను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని.. ఆ జీవోను వ బేషరతుగా ఉపసంహరించుకోవాలని వారు డిమాండ్ చేశారు.
ప్రజాభీష్టానికి వ్యతిరేకంగా భూసేకరణ..
ఉస్మాన్‌సాగర్ నుంచి గౌరెల్లి, హిమయత్ సాగర్ నుంచి బాపుఘాట్ వరకు మొత్తాన్ని మూసీ కవర్ చేస్తుందని ప్రకటించిన సీఎం రేవంత్ రెడ్డి… బ్లూ మాస్టర్ ప్లాన్, గ్రీన్ మాస్టర్ ప్లాన్, ల్యాండ్ మాస్టర్ ప్లాన్, మార్క్ ప్రాజెక్ట్, ఇన్ ఫ్రా మాస్టర్ ప్లాన్, ఫైనాన్షాయల్ మాస్టర్ ప్లాన్‌లో వీటిలో ఏ ఒక్కటి కూడా ప్రజాభిప్రాయానికి పెట్టలేదన్నారు. ఇందులో డీపీఆర్‌కు సంబంధించిన వివరాలే దాచిపెడుతుందన్నారు. ఇక మూసీ పరివాహాక ప్రాంతంలో ఉన్న జనాల భూములను లాగేసుకుని, పరిహారం విషయంలో రోడ్డున పడేస్తుందన్నారు. భూ నిర్వాసితులకు టీడీఆర్ బాండ్లను జారీ చేయడాన్ని వ్యతిరేకించారు. భూములు కోల్పోతున్నవారికి కనీస సమాచారం కూడా లేదన్నారు. కార్యక్రమంలో కే.సజయ, విశాలాక్షి, వాసుదేవరావు, సలీం, చైతన్య, మధుతోపాటు బండ్లగూడ జాగీర్, హైదర్షాకోట్ కాలనీవాసులు, సయ్యద్ బిలాల్, జాన్ మైఖైల్ ప్రజా ఉద్యమాల జాతీయ వేదిక, రుచిత్ షా కమల్ తదితరులు పాల్గొన్నారు.