హిమాయత్‌నగర్,జనవరి7: రాష్ట్రంలోని మాల సామాజిక వర్గంను నమ్మించి మోసం చేసిన సీఎం రేవంత్‌రెడ్డి ప్రభుత్వానికి తగిన గుణపాఠం చెప్పాలని నేషనల్ అంబేడ్కర్ సేన జాతీయ అధ్యక్షుడు మన్నె శ్రీధర్‌రావు, మాల మహానాడు జాతీయ అధ్యక్షుడు డాక్టర్ పబ్బతి శ్రీకృష్ణ, టీ.రాష్ట్ర అధ్యక్షుడు తాలుకా రాజేష్ మాలలకు పిలుపు నిచ్చారు. బుధవారం హైదర్‌గూడలోని ఎన్ఎస్ఎస్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీకి అండగా నిలిచిన మాలలను అణచివేసేందుకు మాలల గళాన్ని నొక్కేందుకు సీఎం రేవంత్‌రెడ్డి కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు.
ఎస్సీ వర్గీకరణ చేసి ఓపెన్ క్యాటగిరిలో లేని రోస్టర్ పాయింట్‌ను మాలలకు అంటగట్టడం అత్యంత దుర్మార్గమన్నారు. బీజేపీ తోపాయికారి ఒప్పందంతో సీఎం రేవంత్‌రెడ్డి మాలలకు శాశ్వతంగా రాజకీయ, విద్య, ఉద్యోగ అవకాశాలు లేకుండా ప్రయత్నించడం సరికాదన్నారు. గ్రూప్1లో 15 కులాలు, గ్రూప్ 2 లో 18 కులాలు, గ్రూప్ 3లో 26 కులాలు ఉండగా గ్రూప్ 3లో రోస్టర్ పాయింట్‌ను 26 పెట్టడం అనేది రాజ్యాంగ విరుద్దమన్నారు.
గతంలో జరిగిన ఉద్యోగ నియామకాలలో అగ్రకులాలకు, ఈడబ్ల్యూఎస్ ఓపెన్ క్యాటగిరి అభ్యర్థులకు ఉద్యోగాలు వచ్చాయే తప్ప మాలలకు రాలేదని, అదే విధంగా వర్గీకరణ చట్టం అమలులోకి వచ్చిన తర్వాత ప్రాథమిక విద్య నుంచి ఉన్నత విద్య వరకు మాలలకు అత్యంత అన్యాయం జరుగుతుందని ఆందోళన వ్యక్తం చేశారు.
మాల సామాజిక వర్గం ఎదుర్కొంటున్న అన్యాయాలపై అసెంబ్లీలో గళమెత్తిన ఎమ్మెల్యే నాగరాజుకు వారు కృతజ్ఞతలు తెలిపారు. మాల సామాజిక వర్గానికి చెందిన డిప్యూటీ సీఎం మల్లు భట్టివిక్రమార్క, స్పీకర్ జి.ప్రసాద్‌కుమార్, మంత్రి జి.వివేక్ వెంకటస్వామి ఇతర నేతలు ఎస్సీ వర్గీకరణలోని రోస్టర్ పాయింట్లపై మౌనం వీడి గ్రూప్ 3లోని 26 కులాలకు జరుగుతున్న అన్యాయాన్ని అడ్డుకోవాలని డిమాండ్ చేశారు.
పార్లమెంట్ సమావేశాలు ముగింపులోపు ప్రభుత్వం రోస్టర్ పాయింట్ 26 నుంచి 16కు సవరించాలని లేని పక్షంలో అమరణ నిరాహారదీక్షలు చేపట్టి ఉద్యమాన్ని మరింత బలోపేతం చేస్తామని వారు హెచ్చరించారు. ఈ సమావేశంలో నేషనల్ అంబేడ్కర్ సేన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బి.కమల్‌కుమార్, మహిళా విభాగం నగర అధ్యక్షురాలు కె.ఎ.స్వప్న,నే తలు కాసుల రాము, సయ్యద్ ఆస్లాం, సయ్యద్ అక్రమ్, షేక్ సాలం, మహ్మద్ జమీల్, సుజాత, గిరిజాశంకర్, ఎస్.ప్రసాద్, వినయ్ తదితరులు పాల్గొన్నారు.