మారేడ్ పల్లి, జూలై 19 : ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బంధువులు చేస్తున్న కుంభకోణాలపై ప్రశ్నిస్తూ జేబీఎస్ వద్ద ఏ టు జెడ్ పేరుతో హోర్డింగు ఏర్పాటు చేసిన ఇద్దరు వ్యక్తులను ఉత్తర మండల టాస్క్ ఫోర్స్ పోలీసులు అరెస్టు చేశారు. ఈ నేపథ్యంలో టాస్క్ ఫోర్స్ పోలీసులు బాపూజీ నగర్‌కు చెందిన కళ్యాణ్ సందీప్, పికెట్ లక్ష్మీ నగర్ కు చెందిన సాయికిరణ్ లను మారేడుపల్లి పోలీసులకు అప్పగించారు. ఈ విషయం తెలుసుకున్న బీఆర్ఎస్ సోషల్ మీడియా రాష్ట్ర కన్వీనర్, మాజీ కార్పొరేషన్ చైర్మన్ మన్నె క్రిశాంక్ బీఆర్ఎస్ న్యాయ విభాగంతో కలిసి మారేడుపల్లి పోలీస్ స్టేషన్ కు చేరుకుని ఇన్స్పెక్టర్తో మాట్లాడి నోటీసులు తీసుకొని బయటకు వచ్చారు.
ఈ సందర్భంగా మన్నె క్రిశాంక్ మీడియాతో మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న తప్పిదాలను ప్రశ్నిస్తే తమపై అక్రమ కేసులు బనాయిస్తున్నారని ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాలనలో జరుగుతున్న అవినీతి కుంభకోణాలను ఎండగట్టినందుకు తమపై కేసులు నమోదు చేయడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. కాంగ్రెస్ వైఫల్యాలను, రేవంత్ రెడ్డి కుటుంబీకులు చేస్తున్న అవినీతిని ప్రజల్లోకి తీసుకెళ్తున్నామని.. వారు చేస్తున్న కుంభకోణాలు వాస్తవం కాదా అని ప్రశ్నించారు. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్ని అక్రమ కేసులు పెట్టినా ప్రజల పక్షాన ప్రశ్నిస్తూనే ఉంటామని… న్యాయపోరాటం ద్వారా అక్రమ కేసులను ఎదుర్కొంటామని స్పష్టం చేశారు. 18 నెలలలో రేవంత్ రెడ్డి సర్కార్ తనపై 25 అక్రమ కేసులు బనాయించిందని తెలిపారు. బ్యానర్లు కట్టిన వారితో పాటు ప్రింట్ చేసిన వారిని సైతం తీసుకురావడం హేయమైన చర్య అని మండిపడ్డారు.