Manikonda | మణికొండ, ఫిబ్రవరి 22: మణికొండ మున్సిపాలిటీలో అడుగడుగునా సమస్యలే దర్శనమిస్తుండటంతో ప్రజలు అల్లాడిపోతున్నారని మున్సిపల్ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు సీతారాం దూళిపాళ అన్నారు. ప్రజాభిప్రాయ సేకరణ కార్యక్రమంలో శనివారం ఆయన స్థానిక నాయకులు ముత్తంగి లక్ష్మయ్య, బొడ్డు శ్రీధర్‌లతో కలిసి బీఎం శ్రేయాస్ అపార్టుమెంటు, మణికొండ స్టీల్స్, పైప్‌లైన్ ప్రాంతం, రత్నదీప్ సూపర్ మార్కెట్, గ్రీన్లివింగ్ పరిసర ప్రాంతాలల్లో పర్యటించారు. ఈ సందర్భంగా స్థానిక ప్రజల సమస్యలను బీఆర్ఎస్ నాయకులు అడిగి తెలుసుకున్నారు.
ఈ సందర్బంగా ప్రజలు అనేక సమస్యలను వారి దృష్టికి తీసుకువచ్చారు. వీధి దీపాలు మొత్తంగా వెలుగడం లేదని, మంచినీటి సరఫరా సక్రమంగా రావడం లేదని, వీధి కుక్కల బెడదతో పిల్లలు, పెద్దలు భయభ్రాంతులతో రోడ్డు నడిచేందుకే వణుకుతున్నారని, పైప్‌లైన్ రోడ్డు నుంచి కాలనీలోకి వెళ్లే దారి మలుపులో చెత్త చెదారం వేయడం వలన చెత్తకుప్పలు దర్శనమిస్తున్నాయని ప్రజలు వాపోయారు. అదేవిధంగా రోడ్డుపై చేపల అమ్మకాల వలన దుర్గంధంతో పాటు చిన్నా, పెద్ద వాహనాలు ఆగి రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు ఏర్పడుతున్నాయని తెలిపారు. కొన్నిసార్లు వాహనాలు అతివేగంగా రోడ్లపై వెళ్తుండటంతో ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయని తక్షణమే సంబంధిత అధికారులు స్పీడ్ బ్రేకర్లను ఏర్పాటు చేసేలో చొరవచూపాలని బీఆర్ఎస్ నాయకులను కోరారు.
ఈ సందర్బంగా పార్టీ అధ్యక్షుడు సీతారాం ధూళిపాళ మాట్లాడుతూ.. గత కొన్నిరోజులుగా మణికొండ మున్సిపాలిటీలో అడుగడుగునా సమస్యలే దర్శనమిస్తున్నాయని అన్నారు. వేసవికాలం ప్రారంభ దశలోనే తాగునీటి సమస్యలు మొదలయ్యాయని, ఇక పరిశుభ్రత విషయంలో అధికారులు పట్టించుకోకపోవడంతో ప్రజలు అవస్థలను ఎదుర్కొంటున్నారని తెలిపారు. ఎక్కడ చూసినా ప్రజలు సమస్యలను పరిష్కరించాలంటూ వేడుకుంటున్నారని అయినా మున్సిపల్ అధికారులు చూసీచూడనట్లుగా వ్యవహరిస్తుండటం సరికాదని మండిపడ్డారు. తక్షణమే ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై చర్యలు తీసుకోవాలని సూచించారు. లేనిపక్షంలో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ఆందోళన చేయాల్సిన పరిస్థితులు వస్తాయని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు రాజేంద్రప్రసాద్, మాల్యాద్రి నాయుడు, యాలాల కిరణ్, సుమనళిని, శ్రీనివాస్ చారి, బీఎం శ్రేయస్ హోమ్స్ అధ్యక్షుడు వంశీ, స్థానికులు నాగేశ్వర్రావు, సురేష్, స్వామి, మహేష్, వెంకట్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.