ఖైరతాబాద్, జూన్ 25 : దివ్యాగులను(Disabled) మోసగించిన చరిత్ర ఈ దేశంలోనే లేదని, ఆ ఘనత ఈ కాంగ్రెస్ సర్కారుకే దక్కుతుందని ఎమ్మార్పీఎస్ అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ(Mandakrishna Madiga) అన్నారు. ఎమ్మార్పీఎస్, వికలాంగుల హక్కుల పోరాట సమితి సంయుక్త ఆధ్వర్యంలో సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వృద్ధులు, వింతంతువులు, ఒంటరి మహిళలు, దివ్యాంగుల పింఛన్లపై రేవంత్(CM Revanth Reddy) సర్కారు అనుసరిస్తున్న తీరును ఎండగట్టారు.
గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ ఆయా వర్గాలకు పింఛన్లు ఇవ్వడంతో పాటు వాటిని పెంచి వారికి ఆసరా అందించారన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడు నెలల కావస్తుందని, ఇప్పటి వరకు పింఛన్లు చెల్లించకపోవడం అత్యంత విచారకరమన్నారు. సొంతంగా పనులు చేసుకోలేని దివ్యాంగులను సైతం విస్మరించారని, మానవత్వం లేని వారు మాత్రమే వారి విస్మరిస్తారన్నారు. రేవంత్ రెడ్డి సర్కారుకు మానవత్వం లేదని ఆరోపించారు.
చేయూత పథకంలో అర్హులైన ప్రతి ఒక్కరిని చిన్న చూపుచూస్తున్నారన్నారు. కాంగ్రెస్ ప్రకటించిన ఆరు గ్యారంటీల్లో చేయూత పింఛన్లు ఒకటని, ప్రభుత్వం ఏర్పడిన మొదటి నెల నుంచి చేయూత పింఛన్లు ఎందుకు అందించలేదని ప్రశ్నించారు. కేసీఆర్ ప్రభుత్వం ఆయా లబ్దిదారులకు ఒకటి నుంచి పదో తేదీలోపు పింఛన్లు చెల్లించేవారని గుర్తు చేశారు.
ఈ ఏడు నెలల కాలంలో నెలకు రూ.896 కోట్ల చొప్పున సుమారు రూ.6,300 కోట్లు చేయూత పించన్లు అందాల్సి ఉందని, పెంచుతామని చెప్పి ఆ పింఛన్లు ఎక్కడికిపోతున్నాయని ప్రశ్నించారు. ఆయా వర్గాలకు ప్రభుత్వం బకాయి పడిందని, ఒకటో తేదీ ఉంచి 5వ తేదీలోపు చెల్లించాల్సిందేనని, పాత బకాయిలన్నీ జూలై 1 నుంచి 2వ తేదీలోపు ఇవ్వాలని, చేయూత పింఛన్లు ఎగ్గొడితే ఊరుకునేది లేదని హెచ్చరించారు. రేవంత్ సర్కారుతో తాడో పేడో తేల్చుకుంటామన్నారు.