రంగారెడ్డి, జనవరి 23 (నమస్తే తెలంగాణ) : నందివనపర్తి దేవాదాయ భూముల జోలికొస్తే ఊరుకునేది లేదని బీఆర్ఎస్ పార్టీ రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు మంచిరెడ్డి కిషన్‌రెడ్డి హెచ్చరించారు. శుక్రవారం ఆయన ఇబ్రహీంప ట్నంలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. యాచారం మండలం నందివనపర్తి గ్రా మంలోని ఓంకారేశ్వరాలయానికి చెందిన భూములను పరిశ్రమల పేరుతో స్వాధీనం చేసుకునేందుకు ప్రభుత్వం యత్నిస్తుండడంతో తీవ్రంగా మండిపడ్డారు.
ఆలయ భూములపై ఆధారపడి జీవిస్తున్న కౌలు రైతుల కడుపు కొట్టేలా ప్రభుత్వం వ్యవహరిస్తుండడం దుర్మార్గమైన చర్యగా పేర్కొన్నారు. ఈ విషయమై ఆయా గ్రామాలకు చెందిన రైతు నాయకులు, బీఆర్ఎస్ నాయకులు మంచిరెడ్డి కిషన్‌రెడ్డిని కలిసి ఆవేదన వ్యక్తం చేశారు. ఆలయ భూములను ముట్టుకుంటే చరిత్ర క్షమించదని, దేవుడి భూముల జోలికి వెళ్లిన వారు చరిత్రలో బాగుపడ్డ దాఖలాల్లేవని హెచ్చరించారు. ప్రభుత్వం తక్షణమే ఆ నిర్ణయా న్ని ఉపసంహరించుకోవాలని..లేకుంటే రైతులతో కలిసి బీఆర్ఎస్ ఆధ్వర్యంలో ఉద్యమాలు చేపడుతామని హెచ్చరించారు. నాయకుడు ప్రశాంత్‌కుమార్‌రెడ్డి, రైతులు పాల్గొన్నారు.