సిటీబ్యూరో, ఏప్రిల్ 12 (నమస్తే తెలంగాణ): ప్రజల ఆరోగ్యంపై కేసీఆర్ సర్కార్ ముందు చూపే నేడు ఎంతో మంది నిరుపేద రోగులకు పునర్జీవం ప్రసాదిస్తున్నది. ‘సమాజం ఆరోగ్యంగా ఉండాలంటే ప్రజలు ఆరోగ్యంగా ఉండాలి….అప్పుడే రాష్ట్రం ఆరోగ్యంగా ఉంటుంది. రాష్ట్రం ఆరోగ్యంగా ఉన్నప్పుడే ఆర్థికంగా ఎదగగలం’అంటూ ప్రజా వైద్యంపై నాటి కేసీఆర్ సర్కార్ ప్రత్యేక దృష్టి సారించిన విషయం తెలిసిందే.
ఈ క్రమంలో రోజురోజుకూ పెరుగుతున్న కిడ్నీ రోగుల సంఖ్యను దృష్టిలో పెట్టుకుని తొలుత నగరంలో డయాలసిస్ కేంద్రాల సంఖ్యను పెంచిన నాటి కేసీఆర్ ప్రభుత్వం.. దశల వారీగా ప్రతి జిల్లాలో కూడా డయాలసిస్ కేంద్రాల ఏర్పాటుకు శ్రీకారం చుట్టిన విషయం తెలిసిందే. హైదరాబాద్ నగరమే ప్రధాన హబ్‌గా, రాష్ట్రంలోని ఆయా జిల్లాలో పనిచేస్తున్న డయాలసిస్ కేంద్రాలను సిటీలోని ప్రధాన ట్రెషరీ హాస్పిటల్స్ పర్యవేక్షిణలోకి తీసుకువచ్చారు. ఈ క్రమంలో రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 102 డయాలసిస్ కేంద్రాలను ఏర్పాటు చేయడంతో పాటు వాటిని ఉస్మానియా, గాంధీ, నిమ్స్ దవాఖానల పర్యవేక్షణలోకి తీసుకువచ్చిన ఘనత నాటి బీఆర్ఎస్ సర్కార్‌దే.
క్లస్టర్ల వారీగా సేవలందిస్తున్న 97 కేంద్రాలు
రాష్ట్రవ్యాప్తంగా102 డయాలసిస్ కేంద్రాలను అందుబాటులోకి తీసుకువచ్చేందుకు శ్రీకారం చుట్టగా, ప్రస్తుతం 97 సెంటర్లు రోగులకు సేవలు అందిస్తున్నాయి. ఈ కేంద్రాలను మూడు క్లస్టర్లుగా విభజించడంతో పాటు ఉస్మానియా, గాంధీ, నిమ్స్ హాస్పిటల్స్‌ను ప్రధాన హబ్స్‌గా ప్రకటించారు. ఒక్కో హబ్ పరిధిలో ఒక్కో క్లస్టర్‌లోని డయాలసిస్ కేంద్రాలు పనిచేస్తున్నాయి. నిమ్స్ హబ్ కింద ఏర్పాటైన క్లస్టర్ పరిధిలో మొత్తం 44 డయాలసిస్ సెంటర్ల ద్వారా ప్రతి రోజూ దాదాపు వెయ్యిమంది నిరుపేద కిడ్నీ రోగులకు సేవలందిస్తున్నాయి. ఉస్మానియా పరిధిలో 27, గాంధీ పరిధిలో 26 డయాలసిస్ సెంటర్లు సేవలందిస్తుండటం విశేషం.
నగరం నుంచే పర్యవేక్షణ..
97 డయాలసిస్ సెంటర్లను,ముఖ్యంగా పేషెంట్ కేర్, డయాలసిస్ సేవల నాణ్యతను నగరంలోని ఉస్మానియా, గాంధీ, నిమ్స్ దవాఖానల్లోన్ని నెఫ్రాలజీ విభాగం వైద్యులు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తుంటారు. అంతేకాకుండా డయాలసిస్ కేంద్రాల్లో సేవలందించే వైద్యసిబ్బందికి అవగాహన కల్పించడం, అత్యవసర పరిస్థితులు ఎదురైనప్పుడు తీసుకోవాల్సిన చర్యలు తదితర అంశాలపై వారికి అవగాహన కల్పిస్తారు.