చురుగ్గా ‘మన ఊరు-మనబడి’ పనులు
మేడ్చల్ జిల్లాలో తొలిదశలో 176 స్కూళ్ల అభివృద్ధి
పదిరోజుల్లో 30 పాఠశాలల్లో పనులు పూర్తి
అభివృద్ధి పనులను వేగవంతం చేసేలా అధికారుల చర్యలు
మేడ్చల్, మే 29(నమస్తే తెలంగాణ): ‘మన ఊరు – మన బడి’ కార్యక్రమంలో చేపట్టిన అభివృద్ధి పనులు పూర్తి చేసి వచ్చే పది రోజులలో పాఠశాలలను ప్రారంభించేందుకు అధికారులు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు. మేడ్చల్ – మల్కాజిగిరి జిల్లాలో ‘మన ఊరు – మన బడి’ కార్యక్రమంలో మొదటి దశలో ఎంపిక చేసిన 176 ప్రభుత్వ పాఠశాలల్లో సుమారు 30 పాఠశాలలకు గాను పది రోజులలో అభివృద్ధి పనులు పూర్తి చేసి ప్రారంభించేందుకు పనులను వేగవంతం చేస్తున్నారు. జిల్లాలోని మేడ్చల్, మల్కాజిగిరి, కూకట్పల్లి, కుత్బుల్లాపూర్, ఉప్పల్ నియోజకవర్గంలోని 15 మండలాలలో మండలానికి రెండు చొప్పున పాఠశాలలను ప్రారంభోత్సవాలకు సిద్ధం చేయాలన్నా జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు 15 మండలాలకు సంబంధించిన అధికారులు ప్రత్యేకంగా పర్యవేక్షిస్తూ పనులు పూర్తి చేయించే పనిలో నిమగ్నమయ్యారు.
ప్రైవేట్ పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలలను తీర్చిదిద్దే క్రమంలో ప్రభుత్వం ‘మన ఊరు -మన బడి’ కార్యక్రమం చేపట్టిన విషయం తెలిసిందే. విద్యార్థులకు మౌలిక సదుపాయాల కల్పనలో భాగంగా 12 అంశాలతో చేపట్టిన అభివృద్ధి పనులకు ప్రభుత్వం రూ.70 కోట్లు మంజూరు చేసింది. ఇప్పటికే రూ.30 లక్షల నిధులు అవసరమయ్యే పాఠశాలలలో అభివృద్ధి పనులు ప్రారంభమయ్యాయి. రూ. 30 లక్షల పైచిలుకు నిధులు అవసరమయ్యే పాఠశాలలో అభివృద్ధి పనులను ప్రారంభించేందుకు టెండర్ పక్రియను అధికారులు కొనసాగిస్తున్నారు. పది రోజులలో ప్రారంభించనున్న 30 పాఠశాలల ప్రధానోపాధ్యాయులతో మేడ్చల్ – మల్కాజిగిరి జిల్లా విద్యాధికారిణి విజయ కుమారి ప్రత్యేక సమావేశం నిర్వహించి, పనులు పూర్తి చేయించేందుకు తీసుకోవాల్సిన విషయాలపై దిశా నిర్దేశం చేశారు. వచ్చే విద్యా సంవత్సరంలో ఇంగ్లిష్ విద్యా బోధనను ప్రారంభించేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న విషయమూ తెలిసిందే. వచ్చే విద్యా సంవత్సరం ప్రారంభమయ్యే నాటికి మొదటి దశలో చేపట్టిన అభివృద్ధి పనులను పూర్తి చేసేందుకు చర్యలు తీసుకుంటున్నారు.
30 పాఠశాలల్లో అభివృద్ధి పనులను ప్రారంభించేందుకు చర్యలు
30 పాఠశాలలో అభివృద్ధి పనులు వేగవంతంగా పూర్తి చేసి ప్రారంభోత్సవాలకు సిద్ధం చేసేలా చర్యలు తీసుకుంటున్నాం. మొదటి దశలో ఎంపిక చేసిన 176 పాఠశాలలకు గాను మేడ్చల్-మల్కాజిగిరి జిల్లాలోని 15 మండలాలలో మండలానికి రెండు పాఠశాలల చొప్పున 10 రోజులలో 30 పాఠశాలలను ప్రారంభించనున్నాం. ఇప్పటికే వివిధ ప్రభుత్వ పాఠశాలల్లో పనులు ప్రారంభం అయ్యాయి. ప్రభుత్వ ఆదేశాల మేరకు వచ్చే విద్యా సంవత్సరం నాటికి ఎంపిక చేసిన పాఠశాలల్లో అభివృద్ధి పనులు పూర్తయ్యేలా అధికారులకు దిశ నిర్దేశం చేశాం. జరుగుతున్న అభివృద్ధి పనులను క్షేత్రస్థాయిలో అధికారులు పర్యవేక్షించి పనులను పూర్తి అయ్యేలా చూస్తున్నారు.
– హరీశ్, కలెక్టర్, మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా