బంజారాహిల్స్, మే 5 : మద్యం తాగుతూ తండ్రిని, సోదరుడిని తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్న బావమరిదిని మందలించినందుకు.. అది మనసులో పెట్టుకొని బావను హత్య చేశాడు. బంజారాహిల్స్ పోలీస్‌స్టేషన్ పరిధిలో ఈ ఘటన చోటు చేసుకున్నది. బంజారాహిల్స్‌రోడ్ నెం 12లోని ఫస్ట్ లాన్సర్ ప్రాంతంలో నివాసం ఉంటున్న వాహెద్ చికెన్షాపు నిర్వహిస్తుంటారు. కాగా చిన్న కొడుకు సత్తార్ మద్యానికి బానిసగా మారి తరచూ తండ్రి వాహెద్‌తో పాటు అన్నతో గొడవలు పడుతుంటాడు.
డబ్బుల కోసం పలుమార్లు తండ్రిపై దాడికి పాల్పడేవాడు. కాగా ఇదే విషయంపై సయ్యద్‌నగర్‌లో నివాసం ఉంటున్న అతడి బావ ఇలియాజ్ మందలించేవాడు. ఈ క్రమంలో ఆదివారం రాత్రి చికెన్షాపు వద్ద తీవ్రంగా గొడవపడిన సత్తార్ తన తండ్రి వాహెద్‌పై దాడి చేసేందుకు యత్నించగా అక్కడకు చేరుకున్న ఇలియాజ్ అడ్డుకోవడంతో పాటు తీవ్రంగా మందలించడంతో పాటు చేయి చేసుకున్నాడు.
దీంతో అతడిపై కక్ష పెంచుకున్న సత్తార్ అర్ధరాత్రి ఒంటి గంట ప్రాంతంలో బావ ఇంటివద్దకు వచ్చి గొడవకు దిగాడు. పీకలదాకా మద్యం సేవించిన సత్తార్ తన బావ ఇలియాజ్పై కత్తితో విచక్షణా రహితంగా దాడి చేశాడు. ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన ఇలియాజ్‌ను స్థానికంగా ఉన్న రిలీఫ్ ఆస్పత్రికి తరలించారు. అయితే పరిస్థితి విషమంగా ఉందని ఉస్మానియా ఆస్పత్రికి తీసుకువెళ్లాలని సూచించడంతో అక్కడినుంచి బయలుదేరి వెళ్తుండగా దారిలోనే మృతి చెందాడు. నిందితుడు సత్తార్‌ను అరెస్ట్ చేసి బంజారాహిల్స్ పోలీసులు రిమాండ్‌కు తరలించారు.