ఎర్రగడ్డ, జూలై 14: అది రాజీవ్‌నగర్‌లో మండే మార్కెట్.. చిరు వ్యాపారులు, కొనుగోలుదార్లతో ఆ మార్గం కిక్కిరిసి ఉంది… అంతలో ఓ కారు మితిమీరిన వేగంతో వచ్చి స్కూ టీని ఢీకొంది. ఆ ధాటికి వాహనదారుడు అక్కడికక్కడే ప్రాణాలు వదిలాడు. ఈ ఘటన బోరబండ పీఎస్ పరిధిలో సోమవారం సాయంత్రం చోటు చేసుకున్నది. వివరాల్లోకి వెళ్తే.. స్టేషన్ పరిధిలోని రాజీవ్ నగర్లో మండే మార్కెట్ కావడంతో ప్రధాన మార్గం రద్దీగా ఉంది.
అదే సమయంలో మోతీనగర్ వైపు నుంచి అతి వేగంగా వచ్చిన కియా కారు(టీఎస్ 09 జీఏ 9194) యాక్టివా వాహనాన్ని ఢీకొంది. ఆ ధాటికి సదరు వాహనదారుడి తలకు బలమైన గాయాలై అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ ప్రమాదం జరిగిన వెంటనే కారు డ్రైవర్ స్పృహ తప్పి పడిపోయాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని.. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ మార్చురీకి తరలించారు. ప్రమాదానికి కారకుడైన కారు డ్రైవర్‌ను దవాఖానకు తీసుకెళ్లారు. ఈ ఘటనలో మృతి చెందిన వ్యక్తి ఎర్రగడ్డకు చెందిన సత్యనారాయణ(36) అని తెలిసింది.
మార్కెట్లో ట్రాఫిక్ నియంత్రణ చేపట్టాలి
ప్రతి సోమవారం రాజీవ్‌నగర్‌లో జరిగే మార్కెట్ కారణంగా అక్కడ రద్దీని దృష్టిలో ఉంచుకుని ట్రాఫిక్ నియంత్రణకు పోలీసులు విధులు నిర్వహించాలని స్థానికులు చాలా రోజుల నుంచి కోరుతున్నారు. ఇప్పటికైనా ట్రాఫిక్ పోలీసులు కాలనీ వద్ద ట్రాఫిక్ నియంత్రణ చేయాలని కోరారు. కాగా.. సోమవారం జరిగిన ప్రమాద సంఘటన లో ఏడెనిమిది ద్విచక్ర వాహనాలు దెబ్బ తిన్నాయి.