సిటీబ్యూరో, జనవరి 14 (నమస్తే తెలంగాణ): సంక్రాంతి పండుగ వేళ రోడ్లపై తిరుగాలంటే వాహనదారులు, పాదాచరులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మరో 2-3 రోజుల పాటు ఈ చైనా మాంజాల భయం ఉండటంతో నగరవాసులు రోడ్లపైకి రావాలంటేనే భయపడుతున్నారు. అయితే పోలీసులకు ముందుచూపు లేకపోవడంతో.. అంతా మార్కెట్లోకి వెళ్లిపోయినా తర్వాత ఇప్పుడు చైనా మాంజాలపై క్షేత్ర స్థాయిలో స్పెషల్ డ్రైవ్లు నిర్వహిస్తున్నారు.
ఇదేపని 15 రోజుల ముందు నుంచి చేపడితే ఈ పరిస్థితి ఉండేది కాదంటూ విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. ఈ ఏడాది నాలుగు పోలీస్ కమిషనరేట్ల పరిధిలో చైనామాంజా తగిలి పలువురికి గాయాలయ్యాయి. ప్రజల ప్రాణాలపైకి వచ్చిన తర్వాత పోలీసులు మేల్కొన్నారనే విమర్శలు వస్తున్నాయి. చైనా మాంజాలను మార్కెట్లోకి రాకుండా అడ్డుకోవడానికి పోలీసులు కూడా వ్యూహాత్మకంగా వ్యవహారించాల్సిన అవసరముందని నిపుణులు సూచిస్తున్నారు.