బంజారాహిల్స్, జనవరి 2: రోజంతా మద్యం తాగుతుండటంతోపాటు సహజీవనం చేస్తున్న మహిళతో గొడవపడిన ఓ వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. బంజారాహిల్స్ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటుచేసుకున్న ఈ ఘటన వివరాలిలా ఉన్నాయి. కాకినాడ ప్రాంతానికి చెందిన ధర్మ(35) అనే వ్యక్తి సినిమా షూటింగ్స్‌లో ఆర్ట్ డిపార్ట్మెంట్స్లో పని చేస్తుంటాడు. భార్యతో గొడవపడి వేరుగా ఉంటున్న ధర్మకు నాలుగేళ్ల కిందట మల్లమ్మ(39) అనే మహిళతో పరిచయం ఏర్పడింది.
అప్పటి నుంచి వారిద్దరూ కలిసి ఇందిరానగర్‌లో ఓ గది అద్దెకు తీసుకుని నివాసం ఉంటున్నారు. కాగా, బుధవారం నూతన సంవత్సరం కావడంతో ఫ్రెండ్స్‌తో రోజంతా మద్యం సేవించిన ధర్మ సాయంత్రం ఇంటికి వచ్చాడు. అనంతరం రాత్రి 7.30గంటల సమయంలో మరోసారి మద్యం తెచ్చుకుని దూరపు బంధువైన దుర్గ అనే వ్యక్తితో కూర్చుని తాగుతున్నాడు. అయితే రోజంతా తాగేసి వచ్చావు.. మళ్లీ ఎందుకు తాగుతున్నావంటూ మల్లమ్మ ప్రశ్నించింది. దాంతో వారిద్దరి మధ్య గొడవ జరిగింది. అంతటితో ఆగకుండా ఆమెపై దాడి చేశాడు.
రాత్రి 10.30 గంటల సమయంలో మరోసారి ఆమెపై దాడి చేసి ఇంట్లోంచి బయటకు పంపించాడు. అనంతరం అర్ధరాత్రి 12 గంటల సమయంలో ఇంటి నుంచి బయటకు వచ్చి సుమారు గంటసేపు ఆమె బయటనే కూర్చున్నది. ఆ తర్వాత ఇంట్లోకి వెళ్లేందుకు ప్రయత్నించగా.. తలుపులు వేసుకొని ఫ్యాన్‌కు చీరతో ఉరేసుకున్న కనిపించాడు. దీంతో ఆమె గట్టిగా కేకలు వేయడంతో స్థానికులు వచ్చి తలుపులు పగులగొట్టి చూడగా.. అతడు అప్పటికే మృతి చెంది ఉన్నాడు. బంజారాహిల్స్ పోలీసులు మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం దవాఖానకు తరలించి కేసు దర్యాప్తు చేపట్టారు.