జియాగూడ యువకుడి ఆత్మహత్య.. మృతుడి ఫోన్ పరిశీలించాకే స్పష్టత ఇస్తామంటున్న పోలీసులు
సిటీబ్యూరో, ఏప్రిల్ 18 (నమస్తే తెలంగాణ)/జియాగూడ, ఏప్రిల్ 18 : రుణ యాప్ వేధింపుల అంశం మరోసారి కలకలం రేపింది. జియాగూడకు చెందిన ఓ యువకుడు ఆత్మహత్య చేసుకోగా, రుణ యాప్ నిర్వాహకుల వేధింపుల వల్లే అతడు చనిపోయాడని మృతుడి బంధువులు, స్నేహితులు ఆరోపిస్తున్నారు. అయితే అతడి ఫోన్ పరిశీలించాకే.. మృతికి కారణం అదేనా.. మరొకటా.. అన్న విషయమై స్పష్టత వస్తుందని పోలీసులు చెబుతున్నారు. బంధువులు, కుల్సుంపురా పోలీస్‌స్టేషన్ ఎస్సై వేణుగోపాల్ తెలిపిన వివరాల ప్రకారం….జియాగూడ న్యూగంగానగర్‌కు చెందిన మండల రాజ్‌కుమార్ (22) సెల్‌ఫోన్‌లోని ఆన్లైన్ యాప్‌లో రూ. 12 వేల లోన్ తీసుకున్నాడు.
ఈఎంఐ ద్వారా ఇప్పటికే రూ. 4వేలు చెల్లించాడు. అయితే మిగతా డబ్బులు కట్టలేదు. దీంతో ఈఎంఐ కోసం యాప్ నిర్వాహకులు వేధించడం మొదలుపెట్టారు. ‘రాజ్‌కుమార్ మా వద్ద రుణం తీసుకున్నాడు. మీ నంబర్లను రిఫెరెన్స్‌గా ఇచ్చాడు.. అతడు రుణం చెల్లించకపోతే మేం కేసు పెడుతాం.. మీ పేరు కూడా అందులో ఉంటుంది. పోలీస్‌స్టేషన్‌కు రావాలి.. అతడితో రుణం చెల్లించే విధంగా చేయాలి’ అంటూ.. స్నేహితులు, బంధువులకు సందేశాలు పంపించారు. దీంతో వారు తమకు సందేశాలు వస్తున్నాయంటూ.. రాజ్‌కుమార్‌కు చెప్పారు. ఈ క్రమంలో ఆదివారం తెల్లవారుజామున రాజ్‌కుమార్ తల్లి బయటకు వెళ్లి తిరిగొచ్చేసరికి తలుపు తట్టినా తీయకపోవడంతో అనుమానం వచ్చింది.
స్థానికుల సాయంతో తలుపులు పగులగొట్టి చూడగా, రాజ్‌కుమార్ ఫ్యాన్‌కు ఉరివేసుకొని కనిపించాడు. అయితే వెంటనే వైద్యశాలకు తరలించగా అప్పటికే చనిపోయినట్లు వైద్యులు చెప్పారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టిన పోలీసులు రాజ్‌కుమార్ సెల్‌ఫోన్ పాస్వర్డ్ తెలియదని, అది ఓపెన్ అయ్యాక మృతికి కారణాలు వెల్లడిస్తామని చెబుతున్నారు. మరోవైపు నిండు దుఃఖంలోనూ కుటుంబ సభ్యులు రాజ్‌కుమార్ కండ్లను ఎల్వీ ప్రసాద్ కంటి ఆసుపత్రికి దానం చేసి మానవత్వాన్ని చాటుకున్నారు.