Hyderabad | తెలుగు యూనివర్సిటీ, జూన్ 26 : రైళ్లలో దొంగతనాలకు పాల్పడుతున్న ఓ వ్యక్తిని లింగంపల్లి రైల్వే స్టేషన్ ఆవరణలో రైల్వే పోలీసులు అరెస్టు చేశారు. నాంపల్లి రైల్వే పోలీస్ స్టేషన్ సిఐ ప్రవీణ్ కుమార్ తెలిపిన వివరాల ప్రకారం.. లింగంపల్లి రైల్వే స్టేషన్ ప్రాంగణంలో గురువారం ఉదయం సాధారణ తనిఖీలలో భాగంగా తమ సిబ్బంది అనుమానాస్పద స్థితిలో సంచరిస్తున్న ఓ వ్యక్తిని అదుపులోకి తీసుకొని తనిఖీ చేశారు.
నల్లగొండ జిల్లా కేంద్రంలో లెప్రసీ హాస్పిటల్ సమీపంలో ఉండే బల్లాసాగర్ అనిల్ కుమార్ (32) హైదరాబాద్ నగరంలోని చందానగర్ ప్రాంతంలో పూలు అమ్ముకుంటూ జీవనం సాగిస్తూ రైళ్లలో దొంగతనాలకు పాల్పడుతుంటాడు. జూన్ 24వ తేదీ సాయంత్రం చందానగర్ రైల్వే స్టేషన్ మీదుగా వెళుతున్న కాకినాడ స్పెషల్ ట్రైన్లో ఓ మహిళకు సంబంధించిన లగేజీ బ్యాగు చోరీకి గురైనట్లు తమకు ఫిర్యాదు అందినట్లు ఆయన వెల్లడించారు. కాగా విచారణ చేపట్టిన తమ సిబ్బంది అనుమానాస్పద స్థితిలో లింగంపల్లి రైల్వే స్టేషన్ ఆవరణలో సంచరిస్తున్న అనిల్ కుమార్ను అదుపులోకి తీసుకొని లోతైన విచారణ చేయగా అతని వద్ద సుమారు రూ. 20 లక్షల విలువైన బంగారు ఆభరణాలు స్వాధీనం చేసుకున్నట్లు ప్రవీణ్ కుమార్ వెల్లడించారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు అనిల్ కుమార్ను అరెస్టు చేసి రిమాండ్కు తరలించినట్లు తెలిపారు. తనిఖీలలో పాల్గొన్న తమ సిబ్బంది నర్సింగ్ రాథోడ్, ఏ శ్రీనివాస్ షకీల్ పాషా, శ్రీనివాస్, ఇస్మాయిల్ షరీఫ్ లను అభినందించినట్లు తెలిపారు.