ఖైరతాబాద్, సెప్టెంబర్ 11 : క్రికెట్ బెట్టింగ్‌లకు బానిసై…భారీగా నష్టపోయి….దొంగతనం చేసేందుకు ఓ నగల షాపులో చేరిన వ్యక్తి సమయం చూసి స్నేహితుడి సాయంతో కోటికి పైగా విలువైన వజ్రాభరణాలను దోచుకున్నాడు. యజమాని ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేసిన పోలీసులు నిందితులను అరెస్టు చేశారు. సైఫాబాద్ పోలీసు స్టేషన్ పరిధిలో ఈ ఘటన జరిగింది. సెంట్రల్ జోన్ డీసీపీ శిల్పవల్లి గురువారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వివరాలను వెల్లడించారు.
ముంబాయిలోని గైవాడి గిర్గావ్కు చెందిన చదవా రోనక్ (24) క్రికెట్ బెట్టింగ్‌లు నిర్వహిస్తుంటాడు. ఐపీఎల్ మ్యాచ్‌ల నేపథ్యంలో బెట్టింగ్‌లో భారీగా నష్టపోయాడు. నగల షాపులో ఉద్యోగంలో చేరి దొంగతనం చేసి డబ్బులు సంపాదించాలన్న ఆలోచనతో బషీర్‌బాగ్‌లోని విజయ్శంకర్లాల్ జూవెల్లరీస్లో పనికి చేరాడు. వజ్రాభరణాల చోరి కోసం పక్కా ప్లాన్‌తో తన స్నేహితుడు, బెట్టింగ్‌లలో నష్టపోయిన ముంబాయి డోంగ్రి ప్రాంతంలోని జక్రీయా మసీదు స్ట్రీట్‌లో నివాసం ఉండే మహ్మద్ హస్నైన్ హబియాను పిలిపించుకున్నాడు.
ఈ నెల 5న రూ.1.5కోట్ల విలువైన వజ్రాభరణాలను తస్కరించి పారిపోయారు. యజమాని ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేపట్టిన పోలీసులు గురువారం నిందితులిద్దరినీ నాంపల్లి స్టేషన్ వద్ద అరెస్టు చేసి, వారి వద్ద ఉన్న సొత్తును స్వాధీనం చేసుకున్నారు. నిందితులను జూడిషయల్ కస్టడీ కోసం కోర్టులో ప్రవేశపెట్టారు. ఈ సమావేశంలో అడిషనల్ డీసీపీ బి. ఆనంద్, ఏసీపీ ఆర్. సంజయ్ కుమార్, సైఫాబాద్ ఎస్‌హెచ్‌వో కె. రాఘవేందర్, డీఐ ఎన్. రాజేందర్ పాల్గొన్నారు.