నాంపల్లి క్రిమినల్ కోర్టులు, మార్చి 6 (నమస్తే తెలంగాణ) : బర్త్ సర్టిఫికెట్, ఆధార్ కార్డు లేకపోవడం ఓ బాలిక చదువుకు అడ్డంకిగా మారింది. ఆ పత్రాలు లేనందున మల్లెల శ్రీవిద్యను స్కూల్లో చేర్చుకునేందుకు ఎస్ఆర్నగర్లోని శ్రీ విద్యాంజలి ప్రైవేటు పాఠశాల నిరాకరించింది. పత్రాలు పొందేందుకు డబ్బులు లేక పేదరికంతో మగ్గుతున్న శ్రీవిద్యకు న్యాయసేవాధికార సంస్థ అండగా నిలిచింది.
రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ మెంబర్ సెక్రెటరీ పంచాక్షరీ ఆదేశాల మేరకు హైదరాబాద్ జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి, సీనియర్ సివిల్ జడ్జి అబ్దుల్ జావేద్ పాషా విద్యాధికారి రోహిణి సమక్షంలో గురువారం శ్రీవిద్య ఇంటికెళ్లి సమస్య గురించి ఆరా తీశారు. పాఠశాలలో మొదటి తరగతిలో చేర్చుకునేందుకు ధ్రువపత్రాలు కావాలని ప్రిన్సిపాల్ నిరాకరించారని తెలిపారు. ఆధార్ కార్డు కూడా లేదని ప్రిన్సిపాల్ పాఠశాలకు రానివ్వడంలేదని చిన్నారి తల్లి దండ్రులు జడ్జికి వివరించారు. చదువుకునే అవకాశం కల్పించేందుకు పాఠశాల సహకరించాలని, తక్షణం చిన్నారి చదువుకు అనుమతివ్వాలని విద్యాధికారిణిని ఆదేశించారు.
అక్కడినుండి నేరుగా సదరు ప్రైవేటు పాఠశాలకు చేరుకుని చిన్నారి చదువుకు అనుమతివ్వాలని ప్రిన్సిపాల్‌ను కార్యదర్శి కోరారు. చిన్నారికి కావాల్సిన వసతులు కల్పించాలని ఆదేశించారు. తక్షణం ఉన్నత పాఠశాల ప్రిన్సిపాల్, ఉపాధ్యాయులు, విద్యాధికారి సహకారంతో జడ్జి చేతులమీదుగా శ్రీనిధికి పాఠ్యపుస్తకాలు, నోటు పుస్తకాలు అందించారు. ఇలాంటి సంఘటన ఏ విద్యార్థికీ జరగకుండా విద్యాశాఖకు చెందిన అధికారులు చర్యలు తీసుకోవాలని సూచించారు. సమాజంలో పేదలకు విద్య అందినరోజే సమాజం బాగుపడుతుందన్నారు. విద్యాధికారి రోహిణి, డా.శాంతా రాథోడ్ డిప్యూటీ ఇన్పెక్టర్ ఆఫ్ స్కూల్స్, విజయ భాస్కర్ ప్రొటెక్షన్ ఆఫీసర్, సురేశ్ పీఎల్వీ, ప్రిన్సిపాల్, ఉపాధ్యాయులు, సిబ్బంది కార్యదర్శి వెంబడి ఉన్నారు.