మేడ్చల్, జూలై 12 : 70 ఏండ్ల పాలనలో కాంగ్రెస్ రైతాంగానికి ద్రోహం చేసిందని, మళ్లీ తెలంగాణ రైతులపై కుట్రలు చేస్తున్నదని కార్మికశాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. వ్యవసాయానికి 3 గంటల కరెంట్ మాత్రమే ఇస్తామని రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించడం దారుణమని మండిపడ్డారు. ఖబడ్దార్ రేవంత్ రెడ్డి.. ఇలాంటి కుట్రలు చేస్తే తరిమికొడుతామని హెచ్చరించారు. మేడ్చల్ పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తా వద్ద బుధవారం టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మ దహనం చేశారు. రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ, చిత్ర పటాన్ని చెప్పులతో కొడుతూ నిరసన తెలిపారు. కార్యక్రమంలో మంత్రి చామకూర మల్లారెడ్డితో పాటు మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మల్లారెడ్డి మాట్లాడుతూ 70 ఏండ్ల కాంగ్రెస్ పాలనలో రైతులకు ఆత్మహత్యలు మాత్రమే మిగిల్చిందని అన్నారు. సీఎం కేసీఆర్ అధికార పగ్గాలు చేపట్టాకే వ్యవసాయం పండుగలా మారిందని తెలిపారు. రైతుబంధు, రైతుబీమా, 24 గంటల ఉచిత కరెంట్ అందిస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ మాత్రమే అన్నారు.
ఒకబ్లాక్ మెయిలర్కు 130 ఏండ్ల చరిత్ర ఉన్న కాంగ్రెస్ పార్టీని అప్పచెప్పారని, రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ సర్వనాశనం కావడం ఖాయమని మంత్రి మల్లారెడ్డి అన్నారు. టీడీపీలో ఉండి ఆ పార్టీని నాశనం చేశారని, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ వంతు వచ్చిందని చెప్పారు. ధరణి తీసేస్తాం.. వ్యవసాయానికి మూడు గంటల కరెంటు ఇస్తాం అంటే రైతులు తరిమికొడుతారని హెచ్చరించారు. రైతును రాజును చేయాలన్న లక్ష్యంతో సీఎం కేసీఆర్ ముందుకెళ్తున్నారని, అందుకే దేశ వ్యాప్తంగా బీఆర్ఎస్ను స్వాగతిస్తున్నారని మంత్రి చెప్పారు. వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ 103 సీట్లతో హ్యాట్రిక్ కొట్టడం ఖాయమన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ అభ్యర్థులకు డిపాజిట్లు కూడా దక్కవని, గతంలో వచ్చిన 6 సీట్లు కూడా రావన్నారు.
సీఎం కేసీఆర్కు చెడ్డపేరు తేవాలన్న దురుద్దేశంతో కాంగ్రెస్ కుట్రలు పన్నుతుందని ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి అన్నారు. వ్యవసాయానికి 3, 4 గంటల కరెంట్ ఇస్తామని చెప్పడం బాధాకరమన్నారు. రైతులను ముంచాలని కుట్రలు పన్నుతున్న కాంగ్రెస్ పార్టీ నాయకులు ఏ ఊరికి వచ్చినా ప్రజలు తరిమితరిమి కొట్టాలని పిలుపునిచ్చారు. అమెరికాకు రేవంత్రెడ్డి వెళ్లింది ఎన్నికల ఫండ్ కోసమేనని ఆరోపించారు. రేవంత్ రెడ్డి వెంటనే రైతులకు, తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ దయాకర్ రెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ భాస్కర్ యాదవ్, మేయర్లు, చైర్పర్సన్లు మేకల కావ్య, ప్రణీతాశ్రీకాంత్ గౌడ్, మద్దుల లక్ష్మీశ్రీనివాస్ రెడ్డి, కొండల్ రెడ్డి, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు దయానంద్ యాదవ్, పట్టణ అధ్యక్షుడు శేఖర్ గౌడ్, కార్పొరేటర్లు, కౌన్సిలర్లు, కో ఆప్షన్ సభ్యులు, నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.