మేడ్చల్ కలెక్టరేట్, జనవరి 16: గ్రామాలు, మున్సిపాలిటీల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం పైస ఇవ్వలేదని మల్కాజిగిరి పార్లమెంట్ సభ్యులు ఈటల రాజేందర్ పేర్కోన్నారు. నాగారం మున్సిపాలిటీ రాంపల్లి గ్రామంలో రూ.కోటి 43 లక్షల కేంద్ర ప్రభుత్వ నిధులతో నిర్మించనున్న పట్టణ పాథమిక ఆరోగ్య కేంద్రానికి గురువారం మేడ్చల్ ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డితో కలసి ఎంపీ శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఈటల మాట్లాడుతూ, ఏడాది పాలన పూరైనా రాష్ట్ర ప్రభుత్వం స్థానిక సంస్థల అభివృద్ధికి నిధులు మంజూరు చేయ లేదని, దాంతో గ్రామాలు, పట్టణాలలో అభివృద్ధి కుంటుపడిందన్నారు.
కేంద్ర ప్రభుత్వం వైద్య, విద్య, వ్యవసాయం, పరిశ్రమలపై ప్రత్యేక దృష్టి పెట్టిందని చెప్పారు.సంక్షేమ, అభివృద్ధికి కేంద్రం ప్రభుత్వం కోట్ల రూపాయిలు మంజూరు చేస్తుందని తెలిపారు. ఎమ్మెల్యే మల్లారెడ్డి మాట్లాడుతూ, బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో మున్సిపాలిటీ, గ్రామాల అభివృద్ధికి కోట్ల రూపాయిలు కేటాయించిందని, నిధులు లేక అభివృద్ధి పనులు జరగడం లేదని, మున్సిపల్ నిధులతో అభివృద్ధి పనులు చేస్తున్నారని అన్నారు. కాలనీలలో నెలకొన్న సమస్యలు (మంచినీరు, డ్రైనేజ్, రోడ్లు నిర్మించాలని) పరిష్కరించాలని పలు కాలనీల ప్రజలు ఎంపీ, ఎమ్మెల్యేలకు వినతిపత్రాలు అందజేశారు. కార్యక్రమంలో నాగారం మున్సిపల్ చైర్మన్ కౌకుంట్ల చంద్రారెడ్డి, వైస్ చైర్మన్ మల్లేశ్ యాదవ్, కమిషనర్ భాస్కర్ రెడ్డి, డీఈ రఘు, కౌన్సిలర్లు అనంత్ రెడ్డి, లక్ష్మి వేణు, సరిత రమేశ్, కళావతి, కో-అప్షన్ సభ్యులు అశోక్ గౌడ్, బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు శ్రీధర్, బీజేపీ అధ్యక్షులు నాగరాజు యాదవ్, నాయకులు గూడూరు అంజన్న, సాయినాథ్ గౌడ్, శ్రీనివాస్, జగన్ మోహన్ రెడ్డి, సుధాకర్ రెడ్డి, అంజయ్య గౌడ్, పెంటయ్య గౌడ్, నర్సింహ గౌడ్, పరమేశ్, భాస్కర్ పాల్గొన్నారు.