Hyderabad | సిటీబ్యూరో: బ్లాక్ పేపర్‌ను మా దగ్గర ఉన్న కెమికల్లో కడిగితే 500 రూపాయల నోటుగా మారిపోతుంది.. ఈ కెమికల్‌ను కొనుక్కుంటే నల్ల పేపర్లను కరెన్సీ కట్టలుగా మార్చుకుని కోట్లకు పడగలెత్తవచ్చు..! ఇలా వాట్సాప్‌లో మాయమాటలు చెప్పి.. అమాయకులను బురిడీ కొట్టిస్తున్న ఓ విదేశీ ముఠాను మల్కాజ్గిరి ఎస్ఓటీ పోలీసులు పట్టుకున్నారు. ఆ ముఠా చేస్తున్న మోసాలను ఎల్బీనగర్ క్యాంప్ కార్యాలయంలో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో రాచకొండ సీపీ సుధీర్‌బాబు వెల్లడించారు.
సెంట్రల్ ఆఫ్రికాకు చెందిన కామెరూన్ దేశానికి చెందిన ఫ్రాంక్ సెడ్రిక్ అక్రమంగా ఇండియాలో నివసిస్తున్నాడు. 2020లోనే వీసా గడువు ముగిసినప్పటికీ అక్రమంగా ఢిల్లీ, గురుగావ్ ప్రాంతాల్లో ఉంటున్నాడు. ఈ క్రమంలో ఫ్రాంక్ సెడ్రిక్కు మాలి దేశానికి చెందిన గోటి సౌంగలోతో రోలెక్స్, డేవిడ్, జోసెఫ్ పరిచయమయ్యారు. వీరంతా కలిసి ఒక ముఠా కలిశారు. ‘వెరిఫైడ్ క్లోన్ క్రెడిట్ కార్డు’ పేరుతో ఒక వాట్సాప్ గ్రూప్ ఏర్పాటు చేసి అమాయకులను వలలో వేసుకుని పలు మోసాలకు పాల్పడ్డారు. ఈ క్రమంలోనే బోడుప్పల్‌కు చెందిన జొమాటో డెలివరీ బాయ్‌గా పనిచేసే విష్ణువర్ధన్‌రెడ్డిని ఈ వాట్సాప్ గ్రూప్‌లో యాడ్ చేశారు. తమ వద్ద బ్లాక్ కలర్ కరెన్సీ నోట్లు ఉన్నాయని.. వాటిని కెమికల్లో ముంచితే అసలైన కరెన్సీగా మారుతుందని విష్ణువర్దన్ రెడ్డికి విదేశీ ముఠా మెసేజ్ చేశారు. రూ.500కి ఐదు నకిలీ కరెన్సీ నోట్లను ఇస్తామని నమ్మించారు. వాళ్ల మాటలు నమ్మిన బాధితుడు డీల్‌కు ఓకే చెప్పాడు. అయితే.. ముందుగా తనకు డెమో చూపించాలని కోరాడు. దీనికి విదేశీ ముఠా కూడా ఒప్పుకుంది.
ఒప్పందం ప్రకారం.. గత ఏడాది డిసెంబర్ 29వ తేదీన మెహిదీపట్నంలో బాధితుడిని డేవిడ్ కలిశాడు. బాధితుడి నమ్మించేందుకు ఒరిజినల్ 500 నోటుకు బ్లాక్ కలర్ అద్ది తీసుకొచ్చారు. బాధితుడి ముందు ఆ బ్లాక్ కలర్ నోటును ఓ కెమికల్‌తో రుద్ది ఒరిజినల్ నోటుగా మార్చామని మాయ చేసి చూపించారు. ఓ నోటును బాధితుడు తనిఖీ చేయడంతో అసలైన నోటులాగే అనిపించింది. దీంతో కేటుగాళ్ల మాయలో పడిన బాధితుడు.. వాళ్లతో ఒప్పందానికి ఒప్పుకున్నాడు. దీంతో రెండో విడతలో బాధితుడిని మాదాపూర్‌లోని ఒక హోటల్‌కు పిలిపించి ప్రధాన నిందితుడు ఫ్రాంక్ సెడ్రిక్, జోసెఫ్‌లు కలిశారు. అక్కడ బాధితుడు రూ.5 లక్షలను మోసగాళ్లకు అందించి.. రూ.25 లక్షల విలువైన బ్లాక్ కలర్ నోట్లను తీసుకున్నాడు. ఆ సమయంలో బాధితుడికి ఒక కెమికల్, పౌడర్‌ను అందించారు. కెమికల్లో నల్లటి రంగున్న కాగితాలను అద్ది.. ఆ తర్వాత పౌడర్ చల్లితే ఒరిజినల్ నోట్లుగా మారిపోతాయని చెప్పారు. వాళ్ల మాయలో పడిన బాధితుడు.. నిజమే అనుకోని ఆ నకిలీ నోట్లు తీసుకుని కోటి ఆశలతో ఇంటికి వెళ్లాడు.
ఇంటికి వెళ్లిన తర్వాత ఆ నోట్లపై బాధితుడు కెమికల్ అద్ది.. పౌడర్ చల్లాడు. కానీ ఎలాంటి మార్పు కనిపించలేదు. అనుమానం వచ్చి పౌడర్ వాసన చూడటంతో బాధితుడు మత్తులోకి జారుకున్నాడు. గంట తర్వాత మెలుకవ రావడంతో మోసపోయానని గ్రహించి.. వెంటనే మల్కాజ్గిరి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలో డీసీపీ గిరిధర్ నేతృత్వంలో ఇన్స్పెక్టర్ రాములు బృందం రంగంలోకి దిగింది. ఇద్దరు నిందితులు ఫ్రాంక్ సెడ్రిక్,, గోటి సౌంగలోను పోలీసులు అరెస్టు చేశారు. నిందితుల నుంచి రూ. 25 వేల నకిలీ కరెన్సీ నోట్లు, కెమికల్స్, మొబైల్ ఫోన్, ఒక పాస్‌పోర్టు, ఐరన్ బాక్స్‌ను స్వాధీనం చేసుకున్నారు.
మిగిలిన ఇద్దరు నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు.