Charminar | చార్మినార్, ఫిబ్రవరి 10 : నిత్యం వర్తక వ్యాపార నిర్వహణలో కిక్కిరిసి, ఇతర ప్రాంతాల నుండి కొనుగోళ్లకు వచ్చే వారితో రద్దీగా ఉండే దివాన్ దేవిడిలో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. కాగా ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు. సోమవారం తెల్లవారు జామున చోటుచేసుకున్న ఈ ఘటనపై స్థానికులు, అగ్నిమాపక అధికారులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.
దివాన్ దేవిడి లోని అబ్బాస్, మదీనా టవర్ లో సుమారు 400ల వరకు రెడీమెడ్ వస్త్ర వ్యాపారాలు నిర్వహించే హోల్ సెల్ దుకాణాలు కొనసాగుతున్నాయి. ఆదివారం రాత్రి కొన్ని దుకాణాల నిర్వాహకులు తమ కార్యకలాపాలు ముగించుకుని వెళ్లిపోయారు. సోమవారం తెల్లవారు జామున సుమారు 2గంటల ప్రాంతంలో 4వ అంతస్తులో మంటలు రావడం గమనించిన వాచ్ మెన్ వెంటనే మొఘల్‌పుర అగ్నిమాపక కేంద్రానికి సమాచారం అందించారు. సంఘటన స్థలానికి చేరుకున్న అగ్నిమపక సిబ్బంది మాటలను అదుపులోకి తీసుకురావడానికి తీవ్రంగా శ్రమించారు.
అప్పటికి మంటలు అదుపులోకి రాకపోవడం తో జిల్లా అగ్నిమాపక అధికారి వెంకన్న ఆదేశాలతో హై కోర్ట్, యాకుత్ పుర, సికింద్రాబాద్, మల్కాజ్ గిరి, మలక్ పేట్, సాలర్ జంగ్ మ్యూజియం, రాజేంద్రనగర్ ఏరియాల నుండి అగ్ని మాపక శకటాలను రప్పించి మంటలను అదుపుచేయడానికి ప్రయత్నించారు. అగ్ని మాపక శాఖకు చెందిన సుమారు 60 మంది సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకురావడానికి శ్రమించారు. 4వ అంతస్తులో రాజకున్న మంటలు క్రమేణా సెల్లార్ లోని రెండో గ్రౌండ్ లోని దుకాణాల వరకు వ్యాపించాయని అధికారులు తెలిపారు.
400 దుకాణాలు
అబ్బాస్, మదీనా టవర్లోని వస్త్ర సముదాయల్లో వ్యాపారులు చిన్న చిన్న దుకాణాల్లో వ్యాపారాలు నిర్వహిస్తున్నారు. గదులు ఇరుకుగా ఉండడం వల్ల రాజకుంటున్న ప్రాంతాలను చేరుకోవడం సిబ్బందికి కష్టంగా మారింది. అప్పటికే దట్టమైన పొగ వ్యాపించడం, భారీగా మంటలు ఎగిసి పడుతున్నందున 8 ప్రాంతాల నుండి అగ్ని మాపక శకటలను సంఘటన స్థలానికి రప్పించామని జిల్లా అగ్నిమపక శాఖ అధికారి వెంకన్న తెలిపారు. కాగా 400 వరకు దుకాణాలు ఉన్న ఈ సముదాయంలో అగ్నిప్రమాదాల నుంచి రక్షణ చర్యలు ఏవీ లేవని గుర్తించినట్టు ఆయన తెలిపారు.
మంటలు వ్యాపించిన భవ నంలో వాచ్‌మెన్‌తో పాటు అయన కుటుంబం పై అంతస్తులో నివసిస్తున్నారు. అగ్నిమాపక సిబ్బంది కుటుంబ సభ్యులను గుర్తించి వారిని సురక్షితంగా కాపాడి కిందికి తీసుకువచారు పక్క భవనంలో మరో 15మందిని గుర్తించిన సిబ్బంది ముందు జాగ్రత్తగా వాళ్లను కూడా అక్కడి నుండి తరలించారు. సుమారు 60 కోట్లవరకు ప్రాథమికంగా ఆస్తి నష్టం జరిగిందని గుర్తించ్చినట్లు నిర్వాహకులు తెలిపారు. షార్ట్‌సర్య్కూట్ వల్లే ఈ ప్రమాదం జరిగిందని అధికారులు చెప్పారు. సంఘటన స్థలాన్ని చార్మినార్ ఎమ్మెల్యే మీర్ జుల్ఫీకర్ అలీ, ఫైర్ డీజీ జీ వి నారాయణ, అదనపు డీజీ ప్రసన్న కుమార్, డీసీపీ స్నేహ మిశ్రా, ఏసీపీ చంద్రశేఖర్,రీజినల్ ఫైర్ అధికారి హరినాథ్ రెడ్డి, అసిస్టెంట్ డిస్టిక్ ఫైర్ అధికారులు ప్రభాకర్ రెడ్డి, షణ్ముఖ రావు, రఫీ తదితరులు సందర్శించారు.