హైదరాబాద్: హైదరాబాద్‌లో (Hyderabad) వర్షం దంచికొట్టింది. శుక్రవారం మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు సుమారు మూడు గంటల పాటు కురిసిన భారీ వర్షానికి నగర అస్తవ్యస్తంగా మారింది. భారీగా వరద నీరు నిలవడంతో రోడ్లన్నీ చెరువులను తలపించాయి. సికింద్రాబాద్‌లో అత్యధికంగా 11.50 సెంటీమీటర్ల వర్షపాతం నమోదయింది. బోయిన్‌పల్లిలో 12సెం.మీలు, నాచారంలో 10.0 సెం.మీలు, మూసారాంబాగ్‌లో 9.80సెం. మీల చొప్పున వర్షం కురిసింది.
కాగా, చాంద్రాయణగుట్టలో ఓ కారుకు త్రుటిలో ప్రమాదం తప్పింది. శుక్రవారం సాయంత్రం 4 .20 గంటల సమయంలో భారీ వర్షానికి చాంద్రాయణగుట్టలోనిసెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (CRPF) గ్రూప్ సెంటర్ ప్రహరీ గోడ ఒక్కసారిగా కూలిపోయింది. అదేసమయంలో అటుగా ఓ కారు వెళ్తుండగానే గోడ కుప్పకూలింది. అయితే కారు పక్కనే గోడ కూలిపోవడంతో అదృష్ట వశాత్తు అందులో ఉన్నవారికి ఎలాంటి ప్రమాదం జరుగలేదు. కూలిన గోడ సుమారు 30 అడుగుల వెడల్పు, 15 అడుగుల ఎత్తు ఉంది. ఇదంతా సమీపంలో ఉన్న ఓ సీసీ కెమెరాలో రికార్డయింది.
ఇక శుక్రవారం కురిసిన వర్షానికి సికింద్రాబాద్‌లోని పైగా కాలనీలో భారీగా వరద నీరు చేరింది. ఇండ్లలోకి వరద రావడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వరదకు పలు బైకులు కొట్టుకురాగా, కార్లు నీటమునిగాయి. ఇండ్లలోని నీటిని అధికారులు మోటర్ల ద్వారా బటయటకు తోడుతున్నారు. ముందు జాగ్రత్తగా అధికారులు విద్యుత్ సరఫరాను నిలిపివేశారు. కాగా, పైగా కాలనీ ముంపునకు ప్యాట్నీ నాలాలో ఆక్రమణలే కారణమని స్థానికులు ఆరోపిస్తున్నారు. నాలాలోకి హస్మత్ఫేట, రసూల్‌పురా నాలాల నుంచి భారీగా వరద నీరు వస్తుందని, అందువల్ల ప్యాట్నీ నాలా పునరుద్ధరణ పనులు వెంటనే చేపట్టాలని విజ్ఞప్తి చేస్తున్నారు.