మెహిదీపట్నం ఆగస్టు 26: బస్సు స్టార్ట్ చేసే సమయంలో ఇంజన్లో మంటలు వచ్చి దగ్ధమైన ఘటన మెహిదీపట్నం పోలీస్ స్టేషన్ పరిధిలో కలకలం రేపింది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకునే సరికి బస్సు సగభాగం ఫూర్తిగా కాలిపోయింది.వివరాల్లోకి వెళితే మెహిదీపట్నం డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు మంగళవారం ఉదయం మెహిదీపట్నం నుంచి మొయినాబాద్ వెళ్లాల్సి ఉంది.
మెహిదీపట్నం పిల్లర్ నంబర్ 9 సమీపంలో బస్సును డ్రైవర్ జునైద్ స్టార్ట్ చేయడానికి ప్రయత్నించగా ఇంజన్లో షార్ట్ సర్క్యూట్ జరిగి మంటలు చెలరేగాయి. అప్రమత్తమైన డ్రైవర్ బయటకు వచ్చేశాడు. ఈ సమయంలో బస్సులో ఎవరూలేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. పోలీసులు వచ్చే సరికి బస్సు ముందు భాగం పూర్తి కాలి బూడిదయ్యింది. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.