సిటీబ్యూరో, ఆగస్టు 10(నమస్తే తెలంగాణ) ః శనివారం కురిసిన భారీ వానలతో నగరంలోని పలు కాలనీలు ఇప్పటికీ నీటి కొలనులను తలపిస్తున్నాయి. ఓవైపు అధికారులు, మంత్రులు హడావుడి తప్పా… పనులు నిలిచిపోతున్నాయి. దీంతో ఇప్పటికీ 24గంటల గడిచిన నీట మునిగిన కాలనీ వాసులకు వరద ఇబ్బందులు తొలగిపోలేదు.
ఇప్పటికీ వాటర్ లాగింగ్ ప్రాంతాల్లో పేరుకుపోయిన చెత్తాచెదారం తొలగించకపోవడంతో వరద నీరు అలాగే ఉండిపోయింది. దీంతో వాహనదారుల రాకపోకలు తీవ్ర ఇబ్బందులు పడుతుండగా.. ప్రధాన రోడ్ల నుంచి కాలనీల మీదుగా వెళ్లే వాహనదారులు చుక్కలు చూస్తున్నారు. ఇక డ్రైనేజీలన్నీ వరద నీటితో నిండిపోవడంతో పలు కాలన్లీలో ఓవర్ ఫ్లో సమస్య ఉత్పన్నం అవుతుంది.
ముఖ్యంగా తెరిచి ఉంచిన మ్యాన్ హోళ్ల వద్ద సైన్ బోర్డులు ఏర్పాటు చేయకుండా బల్దియా సిబ్బంది విడిచిపెట్టారు. ఆదివారం కొన్ని ప్రాంతాల్లో వర్షం పడినప్పటికీ… రెండు రోజుల కిందటే నిలిచిన వరద నీరు మాత్రం ఇప్పటికీ తొలగించకపోవడంతో నగరంలోని పలు బస్తీలన్నీ కుంటలను తలపిస్తున్నాయి.