Sabitha Indra Reddy | మహేశ్వరం నియోజకవర్గంలోని జల్పల్లి మున్సిపాలిటీ పరిధిలోని కుబా కాలనీతో పాటు ఇతర కాలనీల్లో హైడ్రా ఎఫ్టీఎల్ మార్కింగ్లు జరిగాయని, ప్రజలకు ఎలాంటి సమాచారం ఇవ్వకుండా ఏదైనా జరగరాని పరిణామాలు చోటు చేసుకుంటే ఎవరూ బాధ్యత వహిస్తారని మహేశ్వరం ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి అధికారులపై ధ్వజమెత్తారు. హైడ్రా తీరుపై స్పందించిన ఆమె ఇరిగేషన్ అధికారుల నిర్లక్ష్యమే ఈ పరిస్థితికి కారణమని ఆరోపించారు. అధికారుల పొరపాటు కారణంగా నిర్దోషులైన ప్రజలు నష్టపోతున్నారని, ఇది పూర్తిగా అన్యాయమని అన్నారు.
ప్రజల బాధల పట్ల నేను నిర్లక్ష్యం వహించను. కచ్చితంగా కోర్టుకు వెళ్తామని ప్రజల పక్షాన ఎందాకైనా పోరాడుతామని ఏ ఒక్క ఇల్లు కూల్చే ప్రయత్నం చేసినా, ఊరుకోను. ప్రజలకు అండగా నిలుస్తాను. ఎలాంటి కష్టమొచ్చినా.. రాత్రి అయినా, నాకు ఒక మెసేజ్ చేస్తే చాలు అని ఆమె భరోసా కల్పించారు.
ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో మాజీ మున్సిపల్ చైర్మన్ అబ్దుల్లా సాది, మాజీ కౌన్సిలర్లు, మాజీ కోఆప్షన్ సభ్యుడు సూరెడ్డి కృష్ణారెడ్డి, కాలనీవాసులు తదితరులు పాల్గొన్నారు.