మేడ్చల్, ఫిబ్రవరి 13 (నమస్తే తెలంగాణ) : మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా కీసర గుట్ట రామలింగశ్వేరస్వామి దేవాలయంలో మహాశివరాత్రి సందర్భంగా జరిగే బ్రహ్మోత్సవాలకు ప్రభుత్వం రూ. కోటి నిధులను మంజూరు చేసింది. ఈ నెల 16 నుంచి 21 వరకు జరిగే బ్రహ్మోత్సవాలను వైభవంగా నిర్వహించనున్నారు. నగరానికి సమీపంలో ఉన్న కీసర గుట్టకు హైదరాబాద్, రంగారెడ్డి, వికారాబాద్, యాదాద్రి, సిద్దిపేట తదితర జిల్లాల నుంచి భక్తులు తరలివస్తారు. ఈ సంవత్సరంలో 5 లక్షల పైచిలుకు భక్తులు వస్తారని అంచనా.
అందుబాటులోకి ఆన్లైన్ సేవలు
రామలింగేశ్వరస్వామి దర్శనానికి వచ్చే భక్తుల సౌకర్యార్థం ఆన్లైన్ సేవలు ఆదివారం నుంచి అందుబాటులోకి అధికారులు తీసుకువచ్చారు. వీఐపీ దర్శనం, అభిషేకం, కల్యాణం కోసం ఆన్లైన్ ద్వారా స్లాట్ బుక్ చేసుకున్న భక్తుల వాహనాలకు జడ్పీ గెస్ట్‌హౌజ్ వరకు అనుమతించనున్నారు. వివరాలకు 9701427444 ఫోన్ నంబర్‌కు సంప్రదించాలని అధికారులు సూచిస్తున్నారు.
ముఖ్యమంత్రి కేసీఆర్‌కు కృతజ్ఞతలు
కీసర గుట్ట రామలింగేశ్వరస్వామి బ్రహ్మోత్సవాలకు రూ. కోటి నిధులు మంజూరి చేసిన ముఖ్యమంత్రి కేసీఆర్‌కు కృతజ్ఞతలు. 6 రోజుల పాటు జరిగే బ్రహ్మోత్సవాలకు అన్ని రకాల ఏర్పాట్లు చేసేలా అధికారులను ఆదేశించాం.
– కార్మికశాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి