బంజారాహిల్స్/జూబ్లీహిల్స్, నవంబర్ 7: రాజకీయాల కోసం తన కుటుంబంపై కొందరు కుట్రలు చేస్తున్నారని, నియోజకవర్గమే కుటుంబంగా భావించిన మాగంటి గోపీనాథ్ ప్రతిష్టను దెబ్బతీసేందుకు చిల్లర ప్రయత్నాలు ప్రారంభించారని జూబ్లీహిల్స్ బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీతా గోపీనాథ్ ఆరోపించారు. ఎవరెన్ని కుట్రలు చేసినా చివరకు ధర్మమే గెలుస్తుందని ఆమె స్పష్టం చేశారు.
పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో ముఖ్యమంత్రి కేసీఆర్ అందించిన సంక్షేమ పథకాలతో పాటు దివంగత ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ చేసిన అభివృద్ధి కార్యక్రమాలతో పాటు ప్రజల ఆశీర్వాదాలతో రానున్న జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో భారీ మెజారిటీతో విజయం సాధిస్తానని ఆమె ధీమా వ్యక్తం చేశారు. శుక్రవారం రహ్మత్‌నగర్ డివిజన్ కార్మికనగర్, బ్రహ్మశంకర్‌నగర్ తదితర ప్రాంతాల్లో అసిఫాబాద్ ఎమ్మెల్యే కోవా లక్ష్మి, అలంపూర్ ఎమ్మెల్యే విజయుడు, మాజీ డిప్యూటీ స్పీకర్ పద్మాదేవేందర్‌రెడ్డి తదితరులతో కలిసి మాగంటి సునీతాగోపీనాథ్ ఇంటింటి ప్రచారంలో పాల్గొన్నారు.
రాష్ట్రంలో వచ్చేది బీఆర్ఎస్ ప్రభుత్వమే అని అంబర్‌పేట ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్ అన్నారు. శుక్రవారం వెంకటగిరిలో ఆయన ఇంటింటి ప్రచారం నిర్వహించారు. నియోజకవర్గంలో దివంగత మాగంటి గోపీనాథ్ చేసిన అభివృద్ధిని చూసి బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీతా గోపీనాథ్‌ను గెలిపించాలని కోరారు.