పేరు: మాగంటి సునీత
భర్త: మాగంటి గోపీనాథ్
పుట్టిన తేదీ-26-12-1971
వృత్తి : గృహిణి
కుమార్తెలు: మాగంటి అక్షర, మాగంటి దిశిర,కుమారుడు మాగంటి వాత్సల్య
బీఆర్ఎస్ జూబ్లీహిల్స్ అభ్యర్థిగా మాగంటి సునీతా గోపీనాథ్‌ను ప్రకటించడంపై గులాబీ శ్రేణుల్లో హర్షాతిరేకాలు వ్యక్తమయ్యాయి. అనారోగ్య కారణాలతో ఈ ఏడాది జూన్ 8న ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ కన్నుమూశారు. ఆయన మృతితో జూబ్లీహిల్స్‌లో ఉప ఎన్నిక అనివార్యమైంది. త్వరలో ఇందుకు సంబంధించిన షెడ్యూల్ ఎన్నికల సంఘం విడుదల చేయనున్నది. ఈ నేపథ్యంలో సీనియర్ నేతగా, హ్యాట్రిక్ ఎమ్మెల్యేగా ప్రజల అభిమాన నాయకుడిగా స్థానం సంపాదించుకున్న మాగంటి గోపీనాథ్ సతీమణి మాగంటి సునీత గోపీనాథ్‌కే ప్రాధాన్యతనిస్తూ ఆమెను అభ్యర్థిగా ఎంపిక చేశారు. తద్వారా చిత్తశుద్ధి కలిగిన నిస్వార్థ నేతగా మాగంటి గోపీనాథ్ పార్టీకి, ప్రజలకు అందించిన సేవలను గుర్తింపు.. గౌరవాన్ని ఇస్తూ.. జూబ్లీహిల్స్ ప్రజల ఆకాంక్షల మేరకు ఆయన కుటుంబానికే అవకాశం ఇవ్వాలని ఈ సందర్భంగా కేసీఆర్ నిర్ణయించారు. దీంతో నియోజకవర్గంలోని బీఆర్ఎస్ శ్రేణులు మిఠాయిలు పంచుకొని సంబురాలు చేసుకున్నారు. తన అభ్యర్థిత్వాన్ని ఖరారు చేయడంపై అధినేత కేసీఆర్‌కు సునీతా గోపీనాథ్ కృతజ్ఞతలు తెలిపారు.
-సిటీబ్యూరో, సెప్టెంబర్ 26 (నమస్తే తెలంగాణ ) నియోజకవర్గాన్ని బీఆర్ఎస్ కంచుకోటగా మార్చిన మాగంటి గోపీనాథ్ చేసిన సేవలకు గుర్తింపుగా ఆయన కుటుంబానికే టికెట్ ఇవ్వాలని పార్టీ శ్రేణులు కోరుకున్న నేపథ్యంలో అనేక సర్వేల్లో కూడా మాగంటి సునీతా గోపీనాథ్‌కే అనుకూలంగా ఓటర్లు ఉన్నట్లు తేలింది. ఈ నేపథ్యంలో శుక్రవారం మధ్యాహ్నం ఆమెకు టికెట్ ఖరారు చేస్తూ ప్రకటన రాగానే పెద్ద సంఖ్యలో బీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలు యూసుఫ్‌గూడలోని పార్టీ కార్యాలయం వద్ద బాణసంచా కాల్చి సంబురాలు చేసుకున్నారు.
గోపన్న జిందాబాద్ నినాదాలు మార్మోగాయి. జై తెలంగాణ.. జై కేసీఆర్ అంటూ బీఆర్ఎస్ శ్రేణులు మిఠాయిలు పంచుకొని సంబురాల్లో పాల్గొన్నాయి. వెంగళ్రావునగర్ కార్పొరేటర్ దేదీప్యరావు, యూసుఫ్‌గూడ కార్పొరేటర్ రాజ్‌కుమార్ పటేల్, జూబ్లీహిల్స్ కార్పొరేటర్ వెల్దండ వెంకటేశ్‌తో పాటు వివిధ డివిజన్ల నుంచి వచ్చిన బీఆర్ఎస్ నాయకులు మాగంటి సునీతా గోపీనాథ్‌కు అభినందనలు తెలిపారు. అనంతరం మాగంటి సునీతాగోపీనాథ్ తన కుటుంబ సభ్యులతో కలిసి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ను కలిసి కృతజ్ఞతలు తెలిపారు.
జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో కంచుకోటగా మార్చుకున్న బీఆర్ఎస్ ఉప ఎన్నికల్లోనూ గులాబీ జెండాను ఎగరవేసి మరోసారి సత్తా చాటేందుకు శ్రేణులు ఈ ఎన్నికను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. బూత్ స్థాయి నుంచి బలమైన క్యాడర్ కలిగిన పార్టీగా బీఆర్ఎస్ ఉండడం..ఉప ఎన్నికల్లో మాగంటి సునీతా గోపీనాథ్‌ను గెలిపించుకొని గోపీనాథ్‌కు అసలైన నివాళి అర్పించాలని ఆయన అభిమానులు, శ్రేణులు భావిస్తున్నారు. ఈ తరుణంలో కార్యకర్తలు, అభిమానుల కోరిక మేరకు మాగంటి గోపీనాథ్ ఆశయ సాధనకు అనుగుణంగా సునీతాగోపీనాథ్ ప్రజాక్షేత్రంలోనే ఉంటున్నారు. ఈ ఎన్నికపై బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రత్యేక దృష్టి సారించారు.
Brs Leaders
ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను డివిజన్ల వారీగా బాధ్యతలు అప్పగించారు. నిరంతరం పార్టీ ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు, శ్రేణులతో మాట్లాడి భారీ మెజార్టీ లక్ష్యంగా దిశానిర్దేశం చేస్తున్నారు. ఇందులో భాగంగానే తెలంగాణ భవన్ వేదికగా డివిజన్ స్థాయి బూత్ కమిటీ సమావేశాలను నిర్వహించారు. షేక్‌పేట డివిజన్ అన్ని డివిజన్ నాయకులతో కేటీఆర్ ప్రత్యేకంగా సమావేశమై పదేండ్ల బీఆర్ఎస్ పాలనలో సాధించిన ప్రగతి, గడిచిన 22 నెలలుగా కాంగ్రెస్ సర్కారు అరాచక పాలనపై వివరించారు. డివిజన్ స్థాయి సమావేశాలే కాకుండా మాగంటి సునీతాగోపీనాథ్ పర్యటనకు పార్టీ శ్రేణులతో పాటు జనం బ్రహ్మరథం పడుతున్నారు. ఈ క్రమంలోనే బీఆర్ఎస్ అభ్యర్థిగా మాగంటి సునీతా గోపీనాథ్‌ను ప్రకటించగా.. ఆమె గెలుపు నల్లేరు మీద నడకేనని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
మాగంటి సునీతా కుటుంబ నేపథ్యం : కృష్ణాజిల్లా విజయవాడలో పుట్టిన మాగంటి సునీతకు మాగంటి గోపీనాథ్‌తో 12 జూలై 2000లో వివాహం జరిగిన తర్వాత హైదరాబాద్‌కు వచ్చారు. కరోనా సమయంలో పేదలకు నిత్యావసర వస్తువులు అందించడం, ప్రతిరోజూ ఆహారం తయారు చేయించి పంపించడం తదితర పనులన్నీ మాగంటి సునీత గోపీనాథ్ స్వయంగా చూసుకునేవారు. రంజాన్, బతుకమ్మ, క్రిస్మస్ పండుగలకు మహిళలకు బహుమతులను ఎంపిక చేసి ఒక్కో డివిజన్లో సుమారు 5వేలమందికి అందించడంలో మాగంటి సునీతాగోపీనాథ్ కీలకపాత్ర పోషించారు. కార్యకర్తలకు కష్టసుఖాల్లో చేదోడువాదోడుగా నిలుస్తూ వచ్చారు.