కేపీహెచ్‌బీ కాలనీ, మే 10: దేశం కోసం ప్రాణాలను పణంగా పెట్టి పోరాడుతున్న సైనికుల సహాయనిధికి కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు (Madhavaram Krishnarao) కూతురు శ్రీలత, కుమారుడు సందీప్ రావు రూ.10 లక్షల విరాళాన్ని ప్రకటించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కృష్ణారావు మాట్లాడుతూ.. దేశ సరిహద్దుల్లో ప్రాణాలను సైతం లెక్కచేయకుండా కుటుంబాలను, బంధాలు బంధుత్వాలను త్యాగం చేసి పోరాడుతున్న సైనికుల రుణం తీర్చుకోలేనిదన్నారు. ప్రాణాలను సైతం లెక్కచేయకుండా దేశం కోసం పోరాడుతున్న వారి సేవలను కొనియాల్సిందేనన్నారు.
సైనికులకు ఎంత ఇచ్చినా రుణం తీర్చుకోలేనిదని ఈ సమయంలో దేశంలోని ప్రతి పౌరుడు సైనికులకు అండగా నిలవాలని పిలుపునిచ్చారు. తన వంతు బాధ్యతగా సైనిక సంక్షేమ నిధికి ప్రధానమంత్రి సహాయనిధికి పది లక్షల రూపాయలు విరాళంగా అందిస్తున్నట్లు తెలిపారు. పాకిస్తాన్ పై చేపట్టిన ఆపరేషన్ సిందూర్, విజయవంతం కావాలని ఉగ్రవాదం కనుమరుగు కావాలని కోరుకుంటున్నట్లు తెలిపారు దేశంలో ప్రజలందరూ సుభిక్షంగా సుఖశాంతులతో జీవించాలని కోరుకుంటున్నట్లు తెలిపారు.
అందాల పోటీలు విరమించుకోవాలి..
హైదరాబాద్ నగరంలో నిర్వహిస్తున్న అందాల పోటీలని రాష్ట్ర ప్రభుత్వం విరమించుకోవాలని ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు కోరారు. దేశంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో అందాల పోటీలు నిర్వహించడం సరికాదని, దీనిపై ప్రభుత్వం పునరాలోచన చేయాలన్నారు. పాకిస్థాన్‌తో జరుగుతున్న యుద్ధంలో ఎందరో సైనికులు అసువులు బాస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అమరులైన సైనిక కుటుంబాలకు మేము ఉన్నామని ధైర్యాన్ని కల్పించే సంకల్పం తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు. అందాల పోటీలు నిర్వహించడంపై కాకుండా.. యుద్ధ పరిస్థితులను అన్వేషించుకుని ముందుకు వెళ్లాలని ప్రభుత్వానికి సూచించారు.
కష్ట కాలంలో ఆదుకుంటుంది..
కష్ట కాలంలో పేదలను సీఎం రిలీఫ్ ఫండ్ ఆదుకుంటుందని చెప్పారు. కూకట్‌పల్లిలోని క్యాంప్ కార్యాలయంలో కూకట్పల్లి డివిజన్‌కు చెందిన కుక్కల రవిశంకర్ కు రూ.1.50 లక్షల సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కును అందజేశారు. పేదలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. కార్యక్రమంలో కార్పొరేటర్ జూపల్లి సత్యనారాయణ ఉన్నారు.