మాదాపూర్, నవంబర్ 26: నిరుద్యోగులకు శిక్షణ ఇచ్చి ఉద్యోగాలు ఇస్తామంటు నమ్మబలికి వారివద్ద వద్ద డబ్బులు వసూలు చేసిన ఐటీ కంపెనీ బోర్డు తిప్పేసింది. మాదాపూర్‌లోని ఎన్ఎస్ఎన్ ఇన్ఫోటెక్ పేరుతో కొనసాగుతున్న ఐటీ కంపెనీ నిరుద్యోగులకు కుచ్చుటోపీ వేసింది. ట్రైనింగ్ ఇచ్చి ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ చెప్పి గత సంవత్సరం నుంచి పలువురు యువకుల వద్ద రూ. 2 నుంచి 3 లక్షల వరకు వసూలు చేశారు.
దీంతో కొంత మందికి కాల్ లెటర్ ఇచ్చి వారితో పని చేయించుకున్నారు. జీతాలు సరిగ్గా ఇవ్వకుండా ఇదిగో ఇస్తాం.. అదిగో ఇస్తామంటూ జీతాలు ఇవ్వకుండా కాలయాపన చేస్తు సంవత్సరం నుండి ఉద్యోగం చేయించుకున్నారు. మరికొంత మంది వద్ద డబ్బులు తీసుకొని కాల్ లెటర్ వస్తుందని నమ్మించడంతో బాధితులు ఫోన్ చేయగా కొన్ని రోజుల తరువాత ఫోన్ కలవకపోవడంతో చివరికి బాధితులు కంపెనీ వద్దకు వచ్చి చూడడంతో కంపెనీ మూసివేసి ఉంది. దీంతో ప్రభాకర్‌తో పాటు మరో 15 మంది మాదాపూర్ పోలీస్ స్టేషన్ ను ఆశ్రయించి కంపెనీ సీఈఓ శ్రీనివాస్, డైరెక్టర్ స్వామి నాయుడు, హెచ్ అరుణపై ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
వెంగళరావునగర్, నవంబర్ 26: సాఫ్ట్వేర్ ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ లక్షలు దండుకుని మోసగించిన కేటుగాళ్ల పై మధురానగర్ పోలీసు స్టేషన్లో కేసు నమోదైంది. పోలీసులు కథనం ప్రకారం.. మియాపూర్‌కు చెందిన పిక్కిలి నిఖిల(32) ఫేస్బుక్ పేజీలో టార్గెట్ ట్రైనింగ్ అండ్ ప్లేస్మంట్స్ ప్రకటన చూసింది. మల్టీ నేషనల్ కంపెనీ అని సాఫ్ట్ వేర్ ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ నమ్మించారు. గత సెప్టెంబర్‌లో నిఖిల తన రెజ్యుమ్ ఇచ్చిన తర్వాత పంజాబ్‌కు చెందిన మోజే ఇన్ఫోటెక్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ పేరిట రూ.28,63,000 వార్షిక ప్యాకేజీతో నకిలీ ఆఫర్ లెటర్ పంపించి.. గత అక్టోబర్ 16న జాయినింగ్ తేదీగా ఇచ్చారు. నిఖిల నుంచి రూ.8 లక్షల 50 వేలు వసూలు చేశారు. తీరా ఉద్యోగం ఇవ్వలేదు. జీతం ఇవ్వలేదు. ఆఫర్ లెటర్ లో ఉన్న హెచ్ఆర్ ప్రతినిధి రిచికను సంప్రదించేందుకు ప్రయత్నించినా ఆమె అందుబాటులోకి రాలేదు. తాను మోసపోయానని గ్రహించిన బాధితురాలు విచారించగా తనతో పాటు మరికొంత మంది బాధితులు ఉన్నట్లు తెలుసుకున్నారు. తమను మోసం చేసిన పవన్ కుమార్, కిశోర్, ఉదయ్ కిరణ్, హెచ్ఆర్ రితికపై బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.