సిటీబ్యూరో, మార్చి 5 (నమస్తే తెలంగాణ) : మరో నెల రోజుల్లో మెట్రో స్వాధీన ప్రక్రియ ముగియనున్నది. ఎల్ అండ్ టీ నుంచి పూర్తిగా ప్రభుత్వ పరం కానున్నది. అయితే స్వాధీన ప్రక్రియను పట్టాలెక్కించేందుకు ఏర్పాటు చేసిన ఏజెన్సీ, మెట్రో ఆస్తులు, ఎల్ అండ్ టీ వాటాను మాత్రమే అంచనా వేసింది. కానీ ఎల్ అండ్ టీ ఇతర ప్రభుత్వ సంస్థలకు బకాయి పడిన మొత్తాలపై దృష్టి పెట్టలేదని తెలిసింది. మరో నెల రోజులే
సమయం ఉండటంతో.. ఇప్పటివరకు ఎల్ అండ్ టీ పలు సంస్థలకు బకాయి పడిన మొత్తం ఏకంగా రూ. 300 కోట్లపైనే ఉంటుందనే అంచనాలు ఉన్నాయి.
హైదరాబాద్ మెట్రో నుంచి ఎల్ అండ్ టీ పూర్తిగా తప్పుకోనుండగా, ఇప్పుడు ఆ సంస్థకు సర్కారు ఇచ్చిన ఆస్తుల విలువ, కట్టబెట్టిన భూములతోపాటు, మెట్రో సగటు విలువను లెక్కిస్తూ సర్కారు చెల్లింపులు చేసింది. ఎల్ అండ్ టీ వాటాతో కలిపి ఈ మొత్తం రూ. 15 వేల కోట్లు ఉండగా, సర్కారు వీటిని సర్దుబాటు చేసేందుకు ఏడీబీ వంటి ఆర్థిక సంస్థల చుట్టూ తిరుగుతున్నది. అక్కడి నుంచి ఆమోదం రాగానే ముందుగా ఎల్ అండ్ టీకి చెల్లించాల్సిన రూ. 2వేల కోట్లను సర్కారు చెల్లించి, మిగిలిన మొత్తాన్ని రుణాల రూపంలో ఆర్థిక సంస్థలకు నెలవారీగా చెల్లించనున్నది.
తొలి దశ మెట్రోను నిర్వహిస్తున్న ఎల్ అండ్ టీ మరో 15 ఏండ్ల గడువుకు ముందుగానే ఒప్పందం నుంచి వైదొలుగుతున్నది. దీని ద్వారా సర్కారుపై ఎల్ అండ్ టీ బ్యాంకింగ్ సంస్థలకు రుణాల కింద తీసుకున్న మొత్తానికి వడ్డీలు కడుతుండగా.. పెరిగిన అప్పులు ఆ సంస్థకు ఆర్థిక భారంగా మారాయి. దీంతోపాటు కాంగ్రెస్ సర్కారుతో ఏర్పడిన వైరుధ్యాలు కూడా మెట్రో నిర్వహణ నుంచి తప్పుకునేలా చేసింది. దీంతో సర్కారుతో జరిపిన చర్చల్లో తన వాటాను విక్రయించి, మిగిలిన రుణాలను సర్కారు బదిలీ చేసుకునేందుకు ఒప్పందం చేసుకున్నది. ఇందులో నిర్మాణ ఒప్పందంలో పేర్కొన్నట్లు సర్కారు ఇచ్చిన భూముల విలువను మాత్రమే ఇప్పటివరకు లెక్కించారు.
కానీ ఆ తర్వాత ఎల్ అండ్ టీ ఇతర సంస్థలకు చెల్లించాల్సిన బిల్లులపై ఇప్పటివరకు ఒక్కసారి కూడా టేకోవర్‌పై అధ్యయనం చేస్తున్న ఏజెన్సీ చర్చించలేదని సమాచారం. వాటర్ బోర్డు, విద్యుత్ శాఖతోపాటు, బల్దియా వంటి ప్రభుత్వ సంస్థలకు చెల్లించాల్సిన బకాయిల అంశం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. కాగా, ఈ బకాయిల మొత్తాన్ని టేకోవర్ తర్వాత సర్కారు మాఫీ చేస్తుందా? లేక ఎల్ అండ్ టీకి చెల్లించాల్సిన మొత్తం నుంచి కోత విధిస్తుందా అనే అంశంపై సందిగ్ధం నెలకొన్నది.