LRS | సిటీబ్యూరో, మార్చి 30 (నమస్తే తెలంగాణ): జీహెచ్ఎంసీలో ఎల్ఆర్ఎస్ అంచనాలు తప్పాయి. ప్లాట్ల క్రమబద్ధీకరణకు దరఖాస్తుదారులు ఆశించిన స్థాయిలో ముందుకు రాలేదు. వచ్చిన దరఖాస్తుల్లో ఇప్పటి వరకు 8704 మంది మాత్రమే ఎల్ఆర్ఎస్ను సద్వినియోగం చేసుకున్నారు. లక్షా 7వేల దరఖాస్తులను స్వీకరించగా 8704 మంది నుంచి రూ.112 కోట్లు ఆదాయాన్ని జీహెచ్ఎంసీ సమకూర్చుకున్నది.
ఈ నేపథ్యంలోనే ఎల్ఆర్ఎస్ ద్వారా రూ.500కోట్ల అదాయం వస్తుందని అధికారులు అంచనా తలకిందులయ్యాయి. జోనల్ కార్యాలయాల్లో హెల్ప్ డెస్క్లు ఏర్పాటు, దరఖాస్తుదారులకు ఫోన్లు చేసి రుసుం చెల్లించాలని కోరినా ఆశించిన స్థాయిలో స్పందన రాలేదు. కాగా నేటితో 25శాతం రాయితీ గడువు ముగుస్తుండడం, మరికొందరు లబ్ధిదారులు గడువు పెంచుతారన్న ఆశగా ఎదురుచూస్తున్నారు.
జీహెచ్ఎంసీ పరిధిలో 1.07 లక్షల దరఖాస్తులు రాగా, రుసుం చెల్లించేందుకు జనరేటైన దరఖాస్తులు 58,523 మాత్రమే. మొత్తం దరఖాస్తుల్లో ఇది 54 శాతం. మరో 49,342 దరఖాస్తులకు రుసుం నిర్థారణ జరగలేదు. ఇందులో మెజార్టీ ప్రభుత్వ వక్ఫ్ వంటి నిషేధిత భూములు చెరువులు, కుంటల ఎఫ్టీఎల్ పరిధిలో ఉన్నవిగా భావిస్తున్నారు. చెరువులు, కుంటల పక్కన 200 మీటర్ల దూరంలో ఉన్న ప్లాట్లను పక్కన పెట్టారు.
నిబంధనల ప్రకారం 25 ఎకరాలలోపు విస్తీర్ణంలో ఉన్న చెరువుకు 30 అడుగులు ( 9 మీటర్లు), 25 ఎకరాల విస్తీర్ణం కంటే ఎక్కువ ఉన్న చెరువులకు 100 అడుగులు ( 30 మీటర్లు) ఎఫ్టీఎల్గా నిర్థారించారు. అయితే ఎల్ఆర్ఎస్ మార్గదర్శకాల్లో మాత్రం చెరువులకు 200 మీటర్ల వరకు ఉన్న ప్లాట్ల దరఖాస్తులను పక్కన పెట్టాలని పేర్కొన్నారు. క్షేత్రస్థాయి పరిశీలన ఆనంతరం ఆ దరఖాస్తుల విషయంలో నిర్ణయం తీసుకుంటామని అధికారులు తెలిపారు. రుసుం నిర్థారణ జరిగిన దాదాపు 30 శాతం దరఖాస్తులకు సంబంధించి ఇప్పటికే భవన నిర్మాణ అనుమతులు జారీ అయ్యాయని, పర్మిషన్లు ఇచ్చే సమయంలో ఎల్ఆర్ఎస్ రుసుం వసూలు చేసినట్లు అధికారులు తెలిపారు.
ఎల్ఆర్ఎస్కు స్పందన కరువు
మేడ్చల్, మార్చి30 (నమస్తే తెలంగాణ): ఎల్ఆర్ఎస్కు స్పందన కరువైంది. గడువు ముగుస్తున్నా లక్ష్యం మాత్రం నేరవేరలేదు. ప్రభుత్వ భూముల్లో అక్రమ లేఅవుట్ల క్రమబద్ధీకరణ ఎల్ఆర్ఎస్ పక్రియకు ఆశించిన మేరకు స్పందన రాలేదు. దీనికి అధికారుల నిర్ల్యక్షం వల్లే దరఖాస్తుదారుల్లో అవగాహన లేకపోవడమే కారణమనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో మేడ్చల్-మల్కాజిగిరి జిల్లాలో ప్రభుత్వానికి ఆశించిన స్థాయిలో ఆదాయం వచ్చే అవకాశం లేకుండా పోయింది. ఎల్ఆర్ఎస్ దరఖాస్తుదారులకు పూర్తిస్థాయిలో అవగాహన కలిగించకపోవడంతో పాటు ఉన్నతాధికారుల పర్యవేక్షణ లోపం కారణంగా లక్ష్యాన్ని చేరుకోవడంలో విఫలమైనట్లు తెలుస్తోంది. జిల్లాలో ఎల్ఆర్ఎస్ రాయితీకి 30 శాతానికి మాత్రమే పరిమితమైంది.
జిల్లాలో 1,63 లక్షల దరఖాస్తులు.. ఫీజు చెల్లించింది 31 వేలే!
మేడ్చల్-మల్కాజిగిరి జిల్లాలో 1.63 లక్షల ఎల్ఆర్ఎస్ దరఖాస్తులు రాగా 31 వేల దరఖాస్తుదారులు మాత్రమే క్రమబద్ధీకరణకు ఫీజు చెల్లించారు. దీంతో జిల్లాలో 30 శాతం మాత్రమే సద్వినియోగం చేసుకున్నారు. సుమారు లక్షకు పైగా దరఖాస్తుదారులు ముందుకు రాకపోవడానికి అధికారుల నిర్లక్ష్యమే కారణమనే ఆరోపణలున్నాయి.
25 శాతం రాయితీ ఇచ్చినా ముందుకు రాలేకపోడానికి అవగాహన లోపం ఓ కారణంగా చెబుతున్నారు. నేటితో రాయితీ గడువు ముగుస్తున్న క్రమబద్ధీకరణకు సుమారు 78 వేల మంది ఫీజు చెల్లించాల్సి ఉంది. అయితే గడువు ముగిస్తే వీరి పరిస్థితి ఎమీటన్నది ప్రశ్నర్థకరంగా మారింది. అయితే ప్రభుత్వం గడువు పొడిగించే అవకాశం కల్పిస్తుందా? రాయితీ ఇస్తుందా! లేదా వేచి చూడాల్సిందే. కాగా కొందరికి చేతిలో డబ్బులు లేకపోవడంతో చెల్లించలేపపోయినట్లు దరఖాస్తుదారులు తెలిపారు.