Police Transfers | సిటీబ్యూరో, ఫిబ్రవరి 19 (నమస్తే తెలంగాణ): పోలీసు అధికారుల బదిలీల్లో తమ వారికి అందలం కాదనుకున్న వారికి పాతాళం.. అనే విధంగా రాజకీయ నాయకులు, ప్రజాప్రతినిధుల ఒత్తిళ్లతో ఉన్నతాధికారులు వ్యవహరిస్తున్నట్లు డిపార్ట్మెంట్లో చర్చ జరుగుతున్నది. ఏసీపీలు, ఇన్స్పెక్టర్ల కోసం ఫోన్లలోనే అధికార పార్టీ నాయకులు తమకు కావాల్సిన వారిని ఎంచుకుంటున్నారని, ఇందుకు ఉన్నతాధికారులు ఒకే చెబుతూ.. చేసిన బదిలీలను కూడా రద్దు చేసి మరోసారి వారిని బదిలీ చేస్తున్నారనే విమర్శలు వస్తున్నాయి.
ట్రై పోలీస్ కమిషనరేట్ పరిధిలో రెండు నెలల కిందట నియమితులైన ఓ కమిషనర్.. పార్లమెంట్ ఎన్నికల నిబంధనలో భాగంగా బదిలీ అయ్యారు. కొందరు డీసీపీలను సైతం పోస్టింగ్ ఇచ్చిన నెల రోజుల్లోనే మార్చేశారు. ఇప్పుడు అదే తీరు ఏసీపీలు, ఇన్స్పెక్టర్ల విషయంలోనూ కొనసాగుతున్నది. వచ్చిన పోస్టు ఉంటుందా? పోతుందా? అనే ఆందోళనలో కొందరు ఉంటే.. మరికొందరు తనకు అనుకూలమైన పోస్టు రాలేదంటూ..ప్రజాప్రతినిధి మా వాడే.. అతనే అన్ని చూసుకుంటాడనే ధీమాలో ఉంటున్నారన్న టాక్ నడుస్తున్నది.
గత నెలలో రాచకొండ పోలీస్ కమిషనరేట్ పరిధిలో బదిలీలు జరిగాయి. అప్పటి కమిషనర్.. మహేశ్వరం జోన్‌లోని ఓ ఇన్స్పెక్టర్ను నియమించారు. సదరు కమిషనర్ బదిలీ అయ్యే సమయానికి సదరు ఇన్స్పెక్టర్ను మల్టీజోన్-2 అంటూ.. హైదరాబాద్ కమిషనరేట్‌కు బదిలీ చేయగా ఆయనకు అక్కడి కమిషనర్ మరో ఠాణాలో డీఐగా పోస్టింగ్ ఇచ్చారు. భువనగిరి జోన్లో ఒక ఇన్స్పెక్టర్ను తమకు అనుకూలమైన వారిని మార్చాలంటూ.. లూప్లైన్లోకి వెళ్లిన ఇన్స్పెక్టర్ను తమ పరిధిలోని ఠాణాకు బదిలీ చేయించుకున్నారు. అధికార పార్టీతో అండదండలతోనే ఇప్పుడు పోలీసు శాఖలో పోస్టింగ్‌లు జరుగుతున్నాయని చర్చించుకుంటున్నారు. హైదరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో మలక్‌పేట, చాంద్రాయణగుట్ట ఏసీపీలు బదిలీ అయినా.. కొత్తగా వచ్చిన వారి పోస్టింగ్‌లను రద్దు చేసి తిరిగి అదే అధికారులను నియమించడంపై కూడా చర్చ జరుగుతున్నది.
హైదరాబాద్, రాచకొండ, సైబరాబాద్ కమిషనరేట్ల పరిధిలో సీసీఎస్, సైబర్‌సెక్యూరిటీ బ్యూరోకు, ఎస్బీ, ట్రాఫిక్‌కు బదిలీ అయిన ఏసీపీ స్థాయి అధికారులు తిరిగి తమ పోస్టింగ్‌లు రద్దు చేయించుకొని.. ఇతర పోస్టులను రాబట్టుకున్న వారు చాలా మందే ఉన్నారు. కొందరైతే మొదటి నుంచి రెండో పోస్టింగ్.. మూడో పోస్టింగ్‌ను కూడా తెప్పించుకున్నారని.. మనవాళ్లు అనుకునే వాళ్లు రాజకీయాల్లో ఉంటేనే మంచి పోస్టింగ్ వస్తుందన్న చర్చ పోలీసు వర్గాల్లో ఉంది.