కందుకూరు, నవంబర్ 17 : ఫార్మాసిటీ ఏర్పాటులో భాగంగా భూములు కోల్పోయిన భూ నిర్వాసితులకు గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఎకరాకు 121గజాల స్థలాన్ని కేటాయించింది. మండలంలోని ముచ్చర్ల, మీర్ఖాన్పేట్, పంజగూడ, సాయిరెడ్డిగూడ గ్రామాలకు చెందిన లబ్ధిదారులకు మాజీ మంత్రి, ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి చేతుల మీదుగా పట్టా సర్టిఫికెట్లను అందజేశారు. కాగా మీర్ఖాన్పేట్ సమీపంలోని బేగరికంచ వద్ద 90, 91వ సర్వే నంబర్లలో ఉన్న 620 ఎకరాల్లో బాధితులకు ఎకరాకు 121గజాల చొప్పున ప్లాట్లు ఇచ్చేందుకు హైదరాబాద్, గ్రీన్ ఫార్మాసిటీ లే అవుట్లో బ్లాక్‌ల వారిగా ప్లాట్లను ఏర్పాటు చేశారు. గత జూలైలో రెవెన్యూ, టీజీఐఐసీ అధికారులు అక్కడే లాటరీ ద్వారా రైతులకు ప్లాట్ నంబర్లను కేటాయించారు.
కాగా లాటరీ తీసి మూడు నెలలు దాటినా రిజిస్ట్రేషన్ పత్రాలు అందకపోవడంతో రైతులు అయోమయానికి గురవుతున్నారు. అసలు అధికారులు పత్రాలిస్తారా? ఇవ్వరా? అంటూ దిగులు చెందుతున్నారు. తమ ప్లాట్ల పత్రాలు ఎప్పుడొస్తాయోనని వెయ్యి కండ్లతో ఎదురు చూస్తున్నారు. రిజిస్ట్రేషన్ పత్రాలు అందజేస్తే అక్కర నిమిత్తం అమ్ముకుంటామని కొంతమంది పేర్కొంటున్నారు. ఈ విషయంలో అధికారులు, ప్రజాప్రతినిధులు తమకేమీ పట్టనట్లుగా వ్యవహరిస్తుండడంపై రైతులు మండిపడుతున్నారు. ఎమ్మెల్యే, మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి దృష్టి సారించి ఫార్మా ప్లాట్ల రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్లు త్వరగా అందేలా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.
ప్రభుత్వం ప్లాట్ల నంబర్లు కేటాయించకముందే ఎంతోమంది రైతులు తమ ప్లాట్లను అవసరాల నిమిత్తం నోటరీల ద్వారా ఇతరులకు అమ్ముకున్నారు. ఆ ప్లాట్లకు భవిష్యత్తు ఉంటుందని గ్రహించి తాజా మాజీ ప్రతినిధులు, వ్యాపారులు ఎన్ఆర్ఐలు, పారిశ్రామ్తికవేత్తలు, ఉద్యోగులు వందల సంఖ్యలో ప్లాట్లు కొనుగోలు చేశారు. మొదట్లో 121గజాల ప్లాట్లను రూ.3లక్షలు రూ.5లక్షల వరకు విక్రయించగా, ప్లాట్లను లాటరీ తీసే ముందు రూ.8లక్షల నుంచి రూ.10లక్షలకు అమ్ముకున్నారు. లాటరీ తీసిన తర్వాత రూ.15లక్షల నుంచి రూ.20లక్షల వరకు విక్రయాలు జరిగినట్లు సమాచారం. జూలైలో రైతుల ప్లాట్లకు లాటరీ తీసి ప్లాట్ నంబరు ఇవ్వడంతో కొన్నవారు సంతోషపడ్డారు. కానీ ప్లాట్ల లాటరీ తీసి నెలలు గడుస్తున్నా రిజిస్ట్రేషన్ పత్రాలు రాకపోవడంతో ఆందోళన చెందుతున్నారు. రైతులుకు పత్రాలు ఇచ్చేదెప్పడు.. తాము రిజిస్ట్రేషన్ చేసుకునేదెప్పుడు? అని దిగులు చెందుతున్నారు.
ఫార్మాసిటీ కోసం ఆరు ఎకరాలకు పైగా భూములిచ్చిన రైతులు నేటికీ ఫార్మా ప్లాట్లకు నోచుకోలేదు. గతలంలో సేకరించిన వెంచర్లో ఇప్పటికే ప్లాట్లు తయారు చేయగా, కాంగ్రెస్ సర్కారు ప్లాట్లు తయారు చేసిన వెంచర్ స్థలంలో 300 గజాల ప్లాట్ల ఏర్పాటుకు బ్రేక్ పడింది. దీంతో 5 ఎకరాలలోపు భూములిచ్చిన రైతులకు 60, 121, 242, 181, 309 ఇలా 5ఎకరాలోపు నిర్వాసితులకు ప్లాట్లను అందజేశారు. స్థలం లేకపోవడంతో ఆరు ఎకరాలకు పైగా భూములు కోల్పోయిన రైతులకు నేటికీ ప్లాట్లను కేటాయించకపోవడంతో వారు ఆందోళన చెందుతున్నారు.
ఫార్మా బాధితులకు రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్లు ఇవ్వాలి. లాటరీ తీసి మూడు నెలలు గడిచినా పత్రాలు ఇవ్వకపోవడం దారణం. బీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చిన హామీ ప్రకారం ఆ వెంచర్లో అన్ని వసతులు కల్పించాలి. అలాగే 600 గజాల ప్లాట్లను లబ్ధిదారులకు కేటాయించి రిజిస్ట్రేషన్ చేసి ఇవ్వాలి. లేదంటే రైతులకు అండగా ఉద్యమం చేపడుతాం.
– సబితా ఇంద్రారెడ్డి, మాజీ మంత్రి
భూనిర్వాసితులకు త్వరలోనే రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్లను అందజేస్తాం. లబ్దిదారులకు ఎకరానికి 121 గజాల చొప్పున రైతుల పేరిట మహేశ్వరం సబ్ రిజిస్టార్ కార్యాలయంలో రిజిస్ట్రేషన్ చేయించి డాక్యుమెంట్లను ఇస్తాం.. 600 గజాల ప్లాట్ల కోసం పక్కనే ఆలయ భూమిని తీసుకున్నాం. దీనికి అనుమతులు రాగానే అభివృద్ధి పనులు చేపట్టి ప్లాట్లను కేటాయిస్తాం.
– జగదీశ్వర్‌రెడ్డి, ఆర్డీవో కందుకూరు